తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 2013 కొంత తీపి, కొంత చేదు అనుభవాన్ని కల్పించింది. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరంలో వేర్వేరు ప్రమాదాల్లో 1,863 మంది మృతి చెందగా,
కొంచెం చేదు కొంచెం తీపి
Published Sun, Dec 29 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 2013 కొంత తీపి, కొంత చేదు అనుభవాన్ని కల్పించింది. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరంలో వేర్వేరు ప్రమాదాల్లో 1,863 మంది మృతి చెందగా, ఆవడి మునిసిపాలిటీకి ఐఎస్‌ఐ ముద్ర పడింది. రాష్ర్ట మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న రమణ తన శాఖల్లో రెండు సార్లు మార్పులను చవిచూశారు. తిరువళ్లూరు జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు ఎవరూ సాధించని రీతిలో ప్లస్‌టూలో వేలమ్మాల్ విద్యార్థిని రక్షణ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి రికార్డును సాధించింది. మొత్తానికి 2013 కొంత తీపి, కొంత చేదు అనుభవాన్ని మిగిల్చింది.
- తిరువళ్లూరు, న్యూస్‌లైన్
ఫిబ్రవరి 8:తిరువళ్లూరు సమీపంలోని ఈకాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోగా దాదాపు 20 మంది గాయపడ్డారు.
ఫిబ్రవరి 28 : తిరువళ్లూరు జిల్లాలోని మనవాలనగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణపై తిరువళ్లూరు కోర్టులో ప్రతిపక్ష నేత, సినీ నటుడు విజయకాంత్‌కు వ్యతిరేకంగా కోర్టులో ప్రభుత్వ న్యాయవాది రామ్‌కుమార్ కేసు దాఖలు చేశారు.
ఏప్రిల్ 5 : కోతకు వచ్చిన వరి పైరును రాత్రికి రాత్రే యంత్రం సాయంతో యజమానికి తెలియకుండా కోసి తీసుకెళ్లిన సంఘటన తిరువళ్లూరు సమీపంలోని భాగసాలై గ్రామంలో జరిగింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఏప్రిల్ 14 : ఎస్టీ భూములను లాక్కున్నారన్న అభియోగంపై తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రమణ్యంపై కేసు నమోదు కావడంతో ఆయన పరారయ్యూరు. దీంతో ఆయన్ను తిరువళ్లూరు పోలీసులు గాలించి, ఆంధ్రా రాష్ట్రం పుట్టపర్తిలో అరెస్టు చేసి తిరువళ్లూరు కోర్టులో హాజరు పరిచారు.
మే 9: రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన ప్లస్‌టూ పరీక్షల్లో తిరువళ్లూరు జిల్లా పొన్నేరికి చెందిన విద్యార్థిని రక్షణ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. జిల్లా ఏర్పాటైన 15 ఏళ్ల తరువాత జిల్లాకు మొదటి స్థానం రావడం ఇదే మొదటిసారి.
మే 23 :తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన వీరరాఘవస్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో దాదాపు ఐదు కోట్లుతో నిర్మించిన నూతన రథాన్ని అందుబాటులోకి తెచ్చారు.
జూన్ 19 : భవిష్యత్తులో వర్షాలు పడే అవకాశాలను మెరుగు పరచడం కోసం ఆవడి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల త్రవ్వకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
జూన్ 26 : జిల్లాలో సమృద్ధిగా వర్షాలు పడాలని కోరుతూ వీరరాఘవస్వామి వారి అర్చకుల ఆధ్వర్యంలో వరుణయాగం రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ యాగంలో దాదాపు 200 మంది అర్చకులు పాల్గొన్నారు.
జూలై 6 : తమిళనాడు- ఆంధ్రా రాష్టాల మధ్య జరిగిన జల ఒప్పందంలో భాగంగా కండలేరు నుంచి విడుదల చేసిన కృష్ణాజలాలు తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన జీరో పాయింట్‌కు చేరడంతో మంత్రులు రమణ, మూర్తి, అబ్దుల్ రహీం పూలు చల్లి స్వాగతం పలికారు.
జూలై 9 : తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ఉండేందుకు రైల్వేస్టేషన్‌లో వెబ్ కెమెరాలను అమర్చారు. ఇది జిల్లాలోని మొదటి కంప్యూటరీకరణ చేసిన రైల్వేకేంద్రం.
జూలై 30 : ప్రతి సంవత్సరం తిరుత్తణి సుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో నిర్వహించే ఆడికృత్తిక ఉత్సవాలు జూలై 30న అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుబ్రమణ్య స్వామి దైవాని, వళ్లితో దర్శనం ఇవ్వగా, రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆగస్టు 20 : తిరువళ్లూరు జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తదితర వాటి కోసం అసెంబ్లీ కమిటీ జిల్లాలోని గుమ్మిడిపూండితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించి కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది.
సెప్టెంబర్ 16 : పోలీసు ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ ముగించుకున్న 300 మంది కానిస్టేబుళ్లకు ఐజి శైలేంద్రబాబు సర్టిఫికెట్లను అందజేశారు.
అక్టోబర్ 1 : జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సవ రించిన నూతన ఓటర్లు జాబితాను కలెక్టర్ వీరరాఘవరావు విడుదల చేశారు. నూతన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 27 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
అక్టోబర్ 26 : ఊత్తుకోట తాలుకా పరిధిలోని కన్నిగై పేర్ గ్రామంలో ఎస్టీల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన అధికారుల తీరుకు నిరసనగా గ్రామస్తులు పాము, తేలు, ఎలుకలతో వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
నవంబర్ 13 : బంగారు నగల కోసం జయలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేసి 40 రోజుల పాటు ప్రీజర్‌లో వుంచిన ముత్తు సెల్వన్‌కు ఉరిశిక్షనూ విధిస్తూ పూందమల్లి కోర్టు న్యాయమూర్తి రవీంద్రబోస్ సంచలన తీర్పును వెలువరించారు.
నవంబర్ 14 : వైద్యశాలలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు నర్సులు ఆపరేషన్ చేయడంతో చిన్నారికి బ్లేడు తగిలి మృతి చెందింది. ఈ సంఘటనతో బాధ్యులను కలెక్టర్ సస్పెండ్ చేయగా, డాక్టర్‌లు, నర్సులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.
నవంబర్ 16 : గుమ్మిడిపూండి సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రహరీగోడ కుప్పకూలిపోయిన సంఘటనలో ఆరుగురు బీహార్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలు మృతి చెందారు.
నవంబర్ 23 : తిరువళ్లూరు జిల్లా ఎస్పీగా వున్న రూపేష్‌కుమార్ మీనా బదిలీపై వెళ్లడంతో నూతన ఎస్పీగా శరవణన్ బాధ్యతలు స్వీకరించారు.
డిసెంబర్ 2 : ఓత్తాండేశ్వర స్వామి వారి అలయ లక్ష దీపారాధన అంగరంగ వైభవంగా జరిగింది. పుష్కరిణిలో లక్ష దీపాలను భక్తులు వెలిగించి, సుందరమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు.
Advertisement
Advertisement