
26 ఏళ్లకే జిల్లా జడ్జిగా ఎంపికైన చైత్ర
రాయచూరు రూరల్: చదువుకునే వయసులోనే ఆమె ప్రతిభకు పదునుపెట్టి జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగానికి ఎంపికైంది. విజయపుర జిల్లాకు చెందిన చైత్రా కులకర్ణి 26 ఏళ్లకే న్యాయపీఠం అధిష్టించబోతున్నారు. బాగలకోటెలోని ఎస్‌ఆర్‌ఎన్ కామర్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వసంత కులకర్ణి కుమార్తె చైత్రా కులకర్ణి విజయపుర జిల్లా ఇండి తాలూకా నందరిగికి చెందినవారు. బాగలకోటెలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. సీనియర్ న్యాయవాది ఆర్‌ఎస్ బరగుండి వద్ద మూడేళ్ల పాటు శిక్షణ పొందారు.
న్యాయ శాఖలో ఇటీవల 101 జడ్జి ఉద్యోగాల నియమకాలకు జరిగిన పరీక్షలకు 4 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 946 మంది ప్రధాన న్యాయమూర్తి పరీక్షకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలలో 86 మందికిగాను 33 మంది ఎంపిక కాగా వారిలో చైత్రా కులకర్ణి కూడా ఉండడం విశేషం. ఆమె ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ మీడియంలోనే విద్యనభ్యసించడం కొసమెరుపు. హైకోర్టులో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టనున్నారు.