2జీ స్పెక్ట్రం కేసులో రూ.1.70 వేల కోట్ల కుంభకోణం ఆరోపణలతో సీబీఐ కేసును ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి రాజా తనకు, తన కుటుంబ
‘2జీ’ రాజా ఆస్తులు రూ.3.60 కోట్లు
Published Fri, Apr 4 2014 1:05 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: 2జీ స్పెక్ట్రం కేసులో రూ.1.70 వేల కోట్ల కుంభకోణం ఆరోపణలతో సీబీఐ కేసును ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి రాజా తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి రూ.3.60 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. యూపీఏ పాలనలో అతి పెద్ద కుంభకోణంగా ముద్రపడిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులు కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేశాయి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. దేశ ప్రజలు ‘ఔరా మరీ ఇంత అవినీతా’ అంటూ ముక్కున వేలేసుకున్నారు.
దీంతో ఉక్కిరిబిక్కిరైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రాజాను బాధ్యుడిని చేసి కటకటాల వెనక్కునెట్టింది. ఆ అవినీతిలో కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళికి కూడా వాటాదక్కిందంటూ ఆమెనూ జైలుకు పంపింది. వీరిద్దరిపై సీబీఐ అభియోగాలుమోపి దర్యాప్తు చేస్తోంది. డీఎంకే ఎంపీగా నీలగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా ఈ సారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. భారీస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజాకు మళ్లీ టికెట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీటిని కరుణ ఖాతరు చేయలేదు. రాజా, కనిమొళిని ఈ కేసులో ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఆయన ఆరోపించారు.
వారిద్దరిపైనా ఆరోపణలేగానీ నిరూపించిన దాఖలాలు లేనందున పార్టీ తరపున పోటీచేసే అవకాశం కల్పించానని సమర్ధించుకున్నారు. లక్షల కోట్ల కుంభకోణం ఆరోపణల్లో చిక్కుకున్న రాజా ఆస్తుల వివరాలు రాష్ట్ర ప్రజలకు ఆసక్తికరంగా మారాయి. ఆస్తులే కాదు, అప్పులు కూడా ఉన్నట్లు తన డిక్లరేషన్‌లో పేర్కొనడం మరింత చర్చనీయాంశమైంది. నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న రాజా బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అందులో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనకు, తన భార్య పరమేశ్వరి, కుమార్తె మయూరి పేరున మొత్తం రూ.3.6 కోట్ల ఆస్తులు, రూ.35.5 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.1.78 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయని వివరించారు. చరాస్తుల్లో రూ.13 లక్షల విలువైన టయోటా కరోలా ఆల్డిస్ కారు, స్థిరాస్తుల్లో ఇల్లు, షేర్లు కలుపుకుని రూ.22.9 లక్షలు, రూ.26.58 లక్షల విలువైన బంగారు నగలు, రూ.64.79 లక్షల బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్టు ఉన్నట్లు తెలిపారు.
ఇవిగాక భార్య, కుమార్తె పేరున తిరుచ్చి గణపతి నగర్‌లో రూ.32.85 లక్షల విలువచేసే 2400 చదరపు అడుగుల ఇల్లు, రూ.93.93 లక్షల స్థిరచరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. రూ.25.5 లక్షల ఆదాయపు పన్ను కేసు, 2జీ స్పెక్ట్రం కేసు తనపై ఉందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2జీ స్పెక్ట్రం కేటాయింపులు ఒక చారిత్రాత్మక ఒప్పందమని, విప్లవాత్మక నిర్ణయమని చెప్పారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్నారు. మధ్యకాలంలో తాను అనేక ఇబ్బందులకు లోనయ్యానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ, పార్లమెంటు కమిటీ విచారణ జరిపాయని, వాటికి తాను బదులిచ్చానని వెల్లడించారు. 2జీ కేటాయింపుల్లో ప్రధాని సూచనలకు అనుగుణంగానే తాను వ్యవహరించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జయలలిత తన ఎన్నికల ప్రచారంలో వక్రీకరిస్తున్నారని విమర్శించారు. 2జీకి సంబంధించి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. అది ఒక విప్లవాత్మకమైన ఒప్పందంగా పేరుగాంచిందని తెలిపారు. తాను ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement