48 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల బాలిక మూడో వివాహం
టీనగర్: అతని వయస్సు 48. ఇప్పటికే ఓ భార్య వదిలి వెళ్లింది. మరో భార్య అతని వద్దే ఉంటోంది. తాజాగా మూడోసారి 14 ఏళ్ల గిరిజన బాలికను వివాహమాడాడు. ఇందుకుగాను బాలిక తండ్రి మూడెకరాల భూమిని వరకట్నంగా అందించాడు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా, డెంకణీకోట తాలూకాలోని కోడాంగియూర్ గ్రామానికి చెందిన మాధప్పన్ (48) రైతు. ఇతని మొదటి భార్య గతంలోనే విడిచి వెళ్లింది. ప్రస్తుతం ఇతని వద్ద రెండో భార్య ఉంటోంది. ఇలావుండగా మాధప్పన్ మూడోసారి అదే గిరిజన గ్రామానికి చెందిన బాలికను (14)ను గత వారం వివాహమాడాడు.
ఆమె ఎనిమిదో తరగతి వరకూ చదివింది. బాలికను వివాహం చేసుకున్నందుకు ఆమె తండ్రి మూడెకరాల పొలాన్ని మాధప్పన్‌కు అందజేశాడు. ఈ విషయం ఆ గ్రామానికి వెళ్లిన ఒక వ్యక్తి ద్వారా కృష్ణగిరి జిల్లా చిన్నారుల సంక్షేమ అధికారి విన్సెంట్‌కు తెలిసింది. గురువారం ఆయన ఒక కమిటీని సదరు గ్రామానికి పంపి విచారణ జరిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కోట్టమంచు గిరిజన గ్రామాల్లో బాల్యవివాహలు పెచ్చుమీరుతున్నాయని, ఇదివరకే తొమ్మిది మంది చిన్నారులకు వివాహాలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం మాధప్పన్ గతవారం వివాహం చేసుకున్నాడని, దీనిపై కృష్ణగిరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశామని చెప్పారు.