బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తూ వివిధ పథకాలు ప్రవేశపెడుతోంది.
సాక్షి, ముంబై: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తూ వివిధ పథకాలు ప్రవేశపెడుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా అరికట్టలేకపోతోంది. రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 85 వేల మంది బాల కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు వివిధ సర్వేల ద్వారా వెలుగులోకి వచ్చింది. కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సంఖ్య స్వల్పంగా తగ్గిందని స్వచ్ఛంద సేవాసంస్థలు పేర్కొన్నాయి. గత ఆరేళ్లలో కార్మిక శాఖ బాల కార్మికుల సంఖ్యపై ఎటువంటి అధ్యయనం నిర్వహించలేదు. దీంతో స్వయం సేవా సంస్థలు అందించిన వివరాలనే పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది. స్వయం సేవా సంస్థల సాయంతోనే కార్మికశాఖ అక్కడక్కడ దాడులు చేస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో ఐదేళ్ల కాలంలో ఐదు వేల బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్గించారు.
కాని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ చేయకపోవడంతో గత్యంతరం లేక తిరిగి పనులకు వెళుతున్నారు. దీంతో బాల కార్మికుల సంఖ్యలో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ముం బైలో శివాజీనగర్, ధారావి, మదన్‌పుర, ఠక్కర్‌బాప్పా తదితర ప్రాంతాల్లో జరీ పనులుచేసే కార్ఖానాలున్నాయి. ఇక్కడ ఒకప్పుడు పెద్ద సంఖ్యలో బాలకార్మికులు ఉండేవారు. కానీ జరీ పనులుచేసే యంత్రాలు అందుబాటులోకి రావడంతో అక్కడ పనిచేసే బాలల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లోనూ బాల కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితులు యథాతథంగా ఉన్నాయి. 14-18 సంవత్సరాల పిల్లలు కూలి పనులకు వెళ్లడం, వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేయడం వల్ల వీరి బాల్యం పనులు చేయడంతోనే అంతమైపోతోందని ఈ అధ్యయనంలో బయటపడింది. గతంతో పోలిస్తే బాల కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ మళ్లీ ఈ సంఖ్య పెరగకుండా స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ఏడాది నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 350 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో 16 వేల మంది పిల్లలను చేర్చారు. చదువుకోవడం వల్ల వచ్చే లాభాలు, చిన్నతనంలో పనిచేయడంవల్ల వచ్చే నష్టాల గురించి వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారిలో మార్పు వచ్చి చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతోందని కార్మిక శాఖ కమిషనర్ మధుకర్ గైక్వాడ్ అన్నారు.