ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు
విశాఖపట్నం: సులభంగా అధికమొత్తంలో డబ్బును ఎలా సంపాదించాలి అని ఆలోచించిన వ్యక్తి పెద్ద మాస్టర్ ప్లానే వేశాడు. ప్లాన్ను అమలు కూడా చేశాడు. అయితే.. ఆ ప్లాన్లో పెద్ద క్రైం కాన్సెప్ట్ ఉండటంతో అతడు కటకటాలు లెక్కపెట్టక తప్పడంలేదు.
వివరాలు.. గతేడాది ఆగస్టులో వెంకటేష్ అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అయితే.. వెంకటేష్ మృతిపై అనుమానాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. దీంతో అతడి మరణం వెనుక ఉన్న కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో కాదు అతడి బావే అని తెలుసుకొని పోలీసులే విస్తుపోయారు. వెంకటేష్ బావ నాగేంద్ర.. ప్లాన్ ప్రకారమే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.
గతంలో వెంకటేష్ పేరుమీద 1.19 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీని అతడి బావ నాగేంద్ర చేయించాడు. బావకు తనపై ఉన్న అభిమానంతో ఇంతమొత్తంలో పాలసీ చేయిస్తున్నాడని ఆ సమయంలో వెంకటేష్ భావించాడే గానీ.. అదే తన ప్రాణాలను తీస్తుందని తెలుసుకోలేక పోయాడు. ఇన్సురెన్స్ డబ్బుకోసం నాగేంద్ర వెంకటేష్ను హత్య చేయించి రైలు నుంచి జారిపడినట్లుగా చిత్రీకరించాడు. అనంతరం నాగేంద్ర 69 లక్షల ఇన్సురెన్స్ క్లయిమ్ కూడా చేసుకున్నాడు. తాజాగా ఈ కేసును చేదించిన పోలీసులు నాగేంద్రకు సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు.