సాక్షి, న్యూఢిల్లీ:
పనిమనుషులపై వేధింపుల విషయం రాఖీ ఘటనతో వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని దారుణాలెన్నో నగరంలో జరుగుతున్నా వాటికి బలవుతున్నవారిని కాపాడే నాథుడే కరువయ్యాడు. పెద్దలపై ప్రతీకారాలు తీర్చుకోవడానికి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. కష్టపడి డబ్బు సంపాదించడం చేతగాక పనికోసం నగరానికి వచ్చే యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. పసిపిల్లలని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వందల రూపాయల కోసం కూడా ప్రాణాలను తీస్తున్నారు. రాజధానిలో పెరుగుతున్న ఈ విష సంసృ్కతికి పోలీసులు చెబుతున్న పలు అపహరణ ఉదంతాలే అద్దంపడుతున్నాయి. ఆ వివరాల్లోకెళ్తే....
రాజధాని నగరంలో కిడ్నాప్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కిడ్నాప్ అవుతున్న వారిలో చిన్నారులే అధికంగా ఉంటుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కల్గిస్తోంది. ఈశాన్య ఢిల్లీలో ఈ దారుణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీ సుల అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదృశ్యమవుతున్నవారిలో బాలబాలికల సంఖ్య దాదాపు సమానంగానే ఉంటోంది. పోలీసులు వీరి జాడ కని పెడుతున్న కేసులు అత్యంత తక్కువగా ఉండడం మరింత బాధాకరం. కిడ్నాప్ కేసుల నమోదులో ఖజూరీ, కరావల్‌నగర్, గోకుల్‌పురి పోలీసు స్టేషన్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. 2011లో 868 పిల్లలు అదృశ్యమయ్యా రు. ఇందులో 448 మంది బాలురు, 420 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 766 మంది జాడను పోలీసులు కనుక్కోగలిగారు. 44 మంది బాలురు, 58 మంది బాలికల జాడ ఇప్పటికీ ఇంకా తెలియలేదు. 2012లో అదృశ్యమైనవారి సంఖ్య 732గా పోలీసుల రికార్డుల్లో నమోదైంది. వీరిలో 361 మంది బాలురు, 298 మంది బాలికల జాడను పోలీసులు కనుగొన్నారు. 35 అబ్బాయిలు, 38 అమ్మాయిల ఆచూకీ ఇంకా తెలియలేదు. అదృశ్యమైన చిన్నారుల కోసం వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు వం దల సంఖ్యలో కిడ్నాప్ కేసులు నమోదవగా వారిలో సగం మందిని మాత్రమే గుర్తించగలిగారు.
ఎలా మాయం అవుతున్నారు?
పోలీసు ఉన్నతాధికారుల చెబుతున్న ప్రకారం.. పిల్లలను అపహరించిన కిడ్నాపర్లు వారిని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తూ అక్కడ వారితో వ్యవసాయ పనులు చేయిస్తున్నారు. యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో పలువురిని గుర్తించారు. బాలికల్లో యుక్త వయస్సువారు అదృశ్యమవుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారు, తల్లిదండ్రులపై ఉన్న పగతో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఉద్యోగాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వస్తున్న యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార గృహాలకు అమ్ముతున్నట్టు స్వచ్ఛంద సంస్థల పరిశీలనలో వెల్లడైంది.
కాఠిన్య నగరం : రాజధానిలో విస్తరిస్తున్న విషసంస్కృతులు
Published Sat, Nov 9 2013 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement