రాష్ట్రంలో కుటుంబ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ పెట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రేషన్ కార్డుకు ఆధార్ కార్డు నంబరు జత పరిచేందుకు తగ్గ కసరత్తులు వేగవంతం అయ్యాయి. బోగస్ కార్డుల ఏరివేత లక్ష్యంగా ఆధార్ నంబర్‌ను లింక్ చేయనున్నామని పౌరసరఫరాల విభాగం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రక్రియ ముగియగానే స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డుల మంజూరు జరుగుతుందంటున్నాయి.
సాక్షి, చెన్నై:
రాష్ట్ర పౌరసరఫరాల విభాగం నేతృత్వంలో రెండు కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేసి ఉన్నారు. 2005లో మంజూరు చేసిన కార్డులు నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి. 2009 నుంచి కొత్త కార్డుల మంజూరు ఆగి ఉన్నాయి. దీంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. పాత కార్డులకు అతుకులు వేస్తూ కాలం గడుపుతూ వస్తున్నారు. ఈ కుటుంబ కార్డు దారులకు ఉచిత బియ్యంతో పాటుగా రాయితీపై నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అన్నిరకాల ధృవీకరణ పత్రాలకు మూలాధారంగా ఈ రేషన్ కార్డులు ఉంటూ వస్తున్నాయి. అలాగే, అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ఈ కార్డుల ఆధారంగానే లబ్ధిదారులకు అందిస్తూ వస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున బోగస్ కార్డులు సైతం ఉన్నట్టు పరిశీలనల్లో తేలిఉన్నాయి.
ఒకే కుటుంబంలో రెండు మూడు కార్డులు, ఒకే చిరునామాతో వివిధ పేర్లతో పలు కార్డులు ఉండటం వంటివి వెలుగు చూసి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్ సబ్సిడీకి ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం లింక్ పెట్టడంతో పెద్ద ఎత్తున్న రెండు మూడు కనెక్షన్లను కల్గిన ఎల్పీజీ వినియోగదారులు గుట్టు రట్టు అయ్యాయి. అవన్నీ రద్దు అయ్యాయి. అలాగే, రాయితీలు వద్దంటూ చమురు సంస్థలు నిర్ణయించిన ధరకే సిలిండర్లను కొనుగోలు చేస్తున్న వాళ్లూ అధికమే. అదే సమయంలో ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ను లింక్ చేశారు. ఈ ప్రక్రియతో నకిలీ ఓటర్ల ఏరి వేత ప్రక్రియ సాగుతూ వస్తున్నది. వీటికి ఆధార్ నంబర్ల అనుసంధానం ఫలితాల్ని ఇవ్వడంతో ఇక రాష్ట్రంలోని బోగస్ రేషన్ కార్డుల ఏరి వేతతో పాటుగా అర్హులైన పేదల్ని ఎంపిక చేయడానికి వీలుగా రేషన్ కార్డులకు ఆధార్ లింక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.
రేషన్‌కు ఆధార్ లింక్: గత కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది స్మార్ కార్డుల రూపంలో రేషన్ కార్డుల మంజూరుకు తగ్గ కసరత్తులు చేపట్టారు. ఇందుకు తగ్గ కార్యాచరణను ప్రైవేటు సంస్థకు అప్పగించి ఉన్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతున్న సమయంలో బోగస్ కార్డుల ఏరి వేతకు ఆథార్ లింక్ పెట్టాలన్న నిర్ణయానికి పౌరసరఫరాల విభాగం వచ్చి ఉన్నది. ఇందుకు తగ్గ ఆదేశాలు అన్ని జిల్లాల్లోని ఆ విభాగం అధికారులకు పంపి ఉన్నారు. రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో దరఖాస్తులు ఇవ్వబోతున్నారు. ఆ దరఖాస్తుల్లో ఆథార్ నెంబరుతో పాటుగా ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను సైతం పొందు పరచాల్సి ఉంటుంది.
ఈ నెంబర్ల ఆధారంగా బోగస్ కార్డుల ఏరి వేతతో పాటుగా అర్హులైన లబ్ధిదారుల్ని ఎంపిక చేసి, స్మార్ కార్డు రూపంలో త్వరలో రేషన్ కార్డులు మంజూరుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంగా ఆ విభాగం అధికారి ఒకరు పేర్కొంటూ, స్మార్ కార్డుల తరహాలో రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్న వేళ ఆథార్ లింక్ పనిలో పనిగా ముగించడం మంచిదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చి ఉన్నదన్నారు. ఆధార్ నెంబర్లను ఇవ్వని పక్షంలో రేషన్ కార్డులు రద్దు అయ్యేప్రమాదం ఉందని హెచ్చరించారు. మరి కొద్ది రోజుల్లో అధికారికంగానే రేషన్ కార్డుకు ఆధార్ లింక్ ప్రకటన వెలువడబోతున్నదని ఆ అధికారి పేర్కొనడం గమనార్హం. ఆధార్ నంబర్లు సరే, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను కోరడం బట్టి చూస్తే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సబ్సీడీ ఏ విధంగా బ్యాంక్ ఖాతాలోకి వెళుతున్నాయో, అదే విధంగా నిత్యవసర వస్తువుల రాయితీని రాష్ట్రప్రభుత్వం బ్యాంక్ ఖాతాలోకి మళ్లిస్తుందా..? అన్న ది వేచి చూడాల్సిందే.
రేషన్‌కూ ఆధార్
Published Fri, Jul 3 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement