ఎంతో చేద్దామనుకున్నా!
ఎంతో చేద్దామనుకున్నా!
Published Sun, Feb 16 2014 10:54 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేద్దామనుకున్నానని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అయితే ఆప్ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ తనపై మంత్రవిద్య ప్రయోగించారని ఆరోపించారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్, విద్య, రహదారులు, ఆస్పత్రులు వంటి వాటిల్లో తాను సాధించిన పురోగతిని కొద్దిసేపు నెమరువేసుకున్నారు. ‘తన ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 97 శాతంమంది ఉత్తీర్ణులయ్యారు. అది దేశంలోనే అత్యధికమన్నారు. అయితే ఢిల్లీని అన్నిరకాలుగా తీర్చిదిద్దాలనే నా కలలు చెదిరిపోయాయి. సాధ్యం కాని హామీలతో ఓట్లు కొల్లగొట్టాడు. ఉచితంగా నీరు ఇస్తామని, తక్కువ చార్జీలకే విద్యుత్ సరఫరా, ఇంకా ఆవాసాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటివాటితో వారి దృష్టి మళ్లించాడు.
49 రోజులపాటు అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి నాపై కేసులు మోపడమే సరిపోయింది. కామన్వెల్త్ క్రీడల వీధిలైట్ల ప్రాజెక్టు కుంభకోణానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని కేజ్రీవాల్ ఆదేశించారు. ఇందులో నా త ప్పు ఏమీ లేదు. 2008 ఎన్నికలకు ముందు నిధులు దుర్వినియోగమయ్యాయంటూ మరో కేసు మోపారు. బీజేపీ నాయకుడు
విజేంద్ర గుప్తా ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఈ కేసు నమోదైంది’ అని అన్నారు. కాగా నగరంలోని ఓ భవంతిలోకి నివాసాన్ని మార్చుకున్న 75 ఏళ్ల షీలా...దానిని తనకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడం, సినిమాలు చూడడం తదితరాలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. అయితే మీడియాతో మాట్లాడే సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. అర్వింద్‌పై మీ అభిప్రాయమేమిటని ప్రశ్నిం చగా జవాబిచ్చేందుకు ఆమె నిరాకరించారు. లోక్‌సభ ఎన్నికలపై ఆప్ ప్రభావం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించగా ఇతర రాష్ట్రాల్లోనూ ఢిల్లీ ప్రయోగాన్ని ప్రతిబింబించేలా చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ కచ్చితంగా ప్రయత్నిస్తాడన్నారు.
అయితే అరాచక పాలన కావాలా లేక మంచి పాలన, అభివృద్ధి కావాలా అనే విషయాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారా అనేది చూడాల్సి ఉందన్నారు. దేశ ప్రజల్లో 99.99 శాతంమంది ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్నే కోరుకుంటారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని, చ ట్టాలను గౌరవించే ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటారన్నారు. మళ్లీ ఎన్నికలు జరిగితే నాలుగోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తామన్నారు. అయితే ఢిల్లీ విధానసభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై ఆమె ఏమీ చెప్పలేకపోయారు. తాము మాత్రమే నిజాయితీపరులమని, ఇతరులంతా అవినీతిపరులని ఆప్ భావిస్తోందన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై స్పందిస్తూ.. ఇక్కడి ప్రజలు బహుశా మార్పు కోరుకుని ఉండొచ్చన్నారు. ధరల పెరుగుదల, యూపీఏ ప్రభుత్వ పనితీరు ప్రభావం పడి ఉండొచ్చన్నారు.
Advertisement