షీలాకు ‘లైట్’ షాక్!
Published Fri, Feb 7 2014 12:04 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ:మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ సర్కార్ ముందడుగు వేసింది. షీలాదీక్షిత్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కామన్వెల్త్ క్రీడల సమయంలో స్ట్రీట్‌లైట్ల కొనుగోలు ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ గురువారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు మొదటి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కామన్వెల్త్ క్రీడల సమయంలో నగరంలో అమర్చిన ఫ్యాన్సీ స్ట్రీట్‌లైట్ల ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. కామన్వెల్త్ క్రీడల సమయంలో స్ట్రీట్‌లైట్ల కొనుగోలుపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరిపించాలని సర్కార్ ఏసీబీని ఆదేశించిందని పీడ బ్ల్యూడీ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. కామన్వెల్త్ క్రీడల సమయంలో స్ట్రీట్‌లైట్ల కొనుగోలు సమయంలో ప్రభుత్వానికి రూ. 31 కోట్ల నష్టం జరిగిందని అప్పట్లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయని సిసోడియా అన్నారు. దీనిలో ఎమ్సీడీ అధికారుల హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయని, ఈ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించామని మనీష్ చెప్పారు.
లైట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అనుమతించినందువల్ల ఏసీబీ దాఖలుచేసే ఎఫ్‌ఐఆర్‌లో ఆమె పేరు ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌తోపాటు ఎమ్సీడీ అధికారులపై కూడా ఎఫ్ ఐఆర్ దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఓ పక్క అధిష్టానం నిర్లక్ష్యంతో డీలాపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు ఆమ్‌ఆద్మీ పార్టీ సర్కార్ నుంచి చిక్కులు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ మద్దతుతోనే ఆప్ సర్కార్ మనుగడ సాగిస్తుండటం వల్ల ఆ పార్టీ షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతోందని బీజేపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల సమయంలో కాంట్రాక్టు నియమాలను పక్కన బెట్టి విదేశాల నుంచి అధిక ధరలకు స్ట్రీట్‌లైట్లను కొన్నట్లు షీలా సర్కారుపై ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో షీలాదీక్షిత్ ైస్ట్రీట్ లైట్ల ప్రాజెక్టుపై సంతకం చేశారు. ఈ కేసుకు సంబంధించి షీలాదీక్షిత్‌పై నేరుగా ఫిర్యాదు దాఖలు కాకపోయినా ఎఫ్‌ఐఆర్‌లో ఆమె పేరు కూడా ఉండే అవకాశాలున్నాయి.
కామన్వెల్త్ క్రీడల సమయంలో ఇందిరాగాంధీ స్టేడియం, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఆకర్షణీయమైన స్ట్రీట్ లైట్లను అమర్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్సీడీ స్ట్రీట్ లైట్లను అమర్చింది. అయితే ఈ లైట్లు కాషాయ రంగులో ఉండడం ముఖ్యమంత్రికి నచ్చలేదు. వాటిని మార్చాలని ఆమె ఆదేశించారు. దాంతో పీడబ్ల్యూడీ ఆదరాబాదరాగా విదేశాల నుంచి ఎక్కువ ధరకు లైట్లను కొనుగోలు చేసి కొత్త లైట్లను అమర్చింది. సౌదీఅరేబియాకు చెందిన స్పేస్ ఏజ్ కంపెనీ నుంచి తెప్పించిన స్ట్రీట్ లైట్లను అమర్చారని, బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినస్పేస్ ఏజ్ కంపెనీని షీలాదీక్షిత్ జోక్యంతో బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని ఆరోపణలు ఉన్నాయి.
ఐదారు వేల రూపాయలకు లభించే లైట్లను ప్రభుత్వం రూ.25 వేల నుంచి రూ.32 వేలకు కొనుగోలు చేసిందని కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి దర్యాప్తు జరిపిన సీఏజీ అభిప్రాయపడింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.31 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఏజీ పేర్కొంది. స్ట్రీట్ లైట్లను సరఫరా చేయడడానికి స్పేస్ ఏజ్ కంపెనీకి కాంట్రాక్టు ఇప్పించడంలో షీలాదీక్షిత్ జోక్యాన్ని ప్రధాన మంత్రి నియమించిన షుంగ్లూ కమిటీ వేలె త్తి చూపింది. షుంగ్లూ కమిటీ నివేదిక ఆధారంగా కామన్వెల్త్ క్రీడల సమయంలో అప్పటి ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి అడ్డదారుల్లో లాభం చేకూర్చిందని మనీష్ సిసోడియా నేతృత్వంలోని పీడబ్ల్యూడీ ఒక నివేదిక రూపొందించినట్లు అనధికార వర్గాలు తెలిపాయి. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవలసిందిగా అవినీతి నిరోధక శాఖను ఆదేశించారు.
2008లో అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు జారీ చేసిన ప్రొవిజనల్ సర్టిఫికెట్ల వ్యవహారంలో షీలా సర్కార్‌ను తప్పుపడ్తూ లోకాయుక్తా సమర్పించిన నివేదిక అధారంగా చర్యలు చేపట్టవలసిందిగా కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖరాసింది. 1984 సిక్కు అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో దర్యాప్తు జరిపించాలని లెప్టినెంట్ గవర్నర్‌కు సిఫారసు చేసింది. తాజాగా ప్రభుత్వ అడ్వర్టయిజ్‌మెంట్ల వ్యవహారంలో దర్యాప్తుకు అదేశించే సన్నాహాలలో ఉంది. ఆప్ సర్కారు చేపడుతున్న ఈ చర్యలతో కాంగ్రెస్, ఆప్‌ల మధ్య దూరం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్, ఆప్‌లు కుమ్మక్కయ్యాయని, గత్యంతరం లేకపోవడం వల్ల షీలా సర్కారుపై దర్యాప్తుకు ఆప్ ఆదేశిస్తోందని ఆరోపిస్తోంది. కాగా ఏసీబీ దర్యాప్తులకు కాంగ్రెస్ భయపడదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత హరూన్ యూసఫ్ చెప్పారు.
Advertisement
Advertisement