షీలాపై చర్యకు సర్కారు సిఫార్సు | Act against Sheila Dikshit for fake certificates to illegal colonies: Aam Aadmi Party | Sakshi
Sakshi News home page

షీలాపై చర్యకు సర్కారు సిఫార్సు

Published Mon, Feb 3 2014 11:53 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

షీలాపై చర్యకు సర్కారు సిఫార్సు - Sakshi

షీలాపై చర్యకు సర్కారు సిఫార్సు

న్యూఢిల్లీ: తన మిత్రపక్షం కాంగ్రెస్‌కు ఆప్ సోమవారం షాక్ ఇచ్చింది. అనధికార కాలనీలకు క్రమబద్ధీకరణ పత్రాల జారీలో జరిగిన అవకతవకలకు బాధ్యురాలైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసింది. అనధికార కాలనీలకు క్రమబద్ధీకరణ పత్రాల జారీపై అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ లోకాయుక్త మన్మోహన్ సరీన్ విచారణ జరపడం తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఆమె ఈ పనిచేశారని గత ఏడాది నవంబర్‌లో ఆయన స్పష్టం చేశారు. పత్రాల జారీకి సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలను కూడా 2008లో అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం పాటించలేదని, ఎన్నికలకు ముందు హడావుడిగా పంపిణీ చేశారని పేర్కొన్నారు. 
 
 ఈ మేరకు షీలా దీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ఆప్ సర్కారును ఇటీవల ఆదేశించారు. కాలనీల క్రమబద్ధీకరణలో అక్రమాలపై బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ లోకాయుక్తకు 2010లో ఫిర్యాదు చేశారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి క్రమబద్ధీకరణ పత్రాలు అందజేసిందని ఆరోపించారు. నగరంలోని 1,639 అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. 2008 ముందు వాటికి తాత్కాలిక క్రమబద్ధీకరణ పత్రాలను (ప్రొవిజనల్ సర్టిఫికెట్స్) పంపిణీ చేసింది. వీటిలో నివసించే 40 లక్షల మందికి అక్కడ కనీస సదుపాయాలు లేకపోవడంతో వాటిని క్రమబద్ధీకరిస్తున్నట్టు ప్రకటించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement