ఆప్.. అనధికార కాలనీల శత్రువు
Published Tue, Feb 4 2014 10:55 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: అనధికార కాలనీలకు క్రమబద్ధీకరణ పత్రాల జారీలో జరిగిన అవకతవకలకు బాధ్యురాలైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆప్.. రాష్ట్రపతికి సిఫార్సు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. అనధికార కాలనీలను షీలా దీక్షిత్ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసిందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మంగళవారం ప్రకటించారు. ‘కాలనీలను క్రమబద్ధీకరించడమే కాదు.. అక్కడ భారీగా అభివృద్ధి పనులు కూడా చేపట్టాం. క్రమబద్ధీకరించకుంటే అక్కడ అభివృద్ధి జరిగేదే కాదు. మురికివాడల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యతిరేకం. ఒకవేళ షీలా రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పనిచేసుంటే..
ఇప్పుడు కేజ్రీవాల్ చర్యలు కూడా అందుకు విరుద్ధంగా ఏమీ లేవు. ఆయన కూడా రాజకీయ ప్రయోజనాలనే ఆశిస్తున్నారు’ అని విమర్శించారు. షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా రాష్ట్రపతి లేఖ రాయడమే దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఇలా చేయడం ద్వారా కేజ్రీవాల్ పేదవారిని అవమానించారని, ఆయన వాళ్లకు శత్రువని లవ్లీ ఆరోపించారు. జన్‌లోక్‌పాల్ బిల్లును రాజ్యాంగ విరుద్ధ పద్ధతుల్లో ఆమోదించడం కూడా రాజకీయ నాటకమని లవ్లీ విమర్శించారు. అనధికార కాలనీలకు క్రమబద్ధీకరణ పత్రాల జారీపై అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ లోకాయుక్త మన్మోహన్ సరీన్ షీలా అక్రమాలకు పాల్పడ్డట్టు నిర్ధారించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఆమె ఈ పనిచేశారని గత ఏడాది నవంబర్‌లో ఆయన స్పష్టం చేశారు.
పత్రాల జారీకి సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలను కూడా 2008లో అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం పాటించలేదని, ఎన్నికలకు ముందు హడావుడిగా పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు షీలా దీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ఆప్ సర్కారును ఆదేశించారు. దీనిపై స్పందించిన ఆప్ ప్రభుత్వం షీలా దీక్షిత్‌పై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరింది. కాలనీల క్రమబద్ధీకరణలో అక్రమాలపై బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ లోకాయుక్తకు 2010లో ఫిర్యాదు చేశారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి క్రమబద్ధీకరణ పత్రాలు అందజేసిందని ఆరోపించారు. నగరంలోని 1,639 అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. 2008 ముందు వాటికి తాత్కాలిక క్రమబద్ధీకరణ పత్రాలను (ప్రొవిజినల్ సర్టిఫికెట్స్) పంపిణీ చేసింది.
Advertisement
Advertisement