వేధింపులకు పాల్పడితే సహించం
Published Wed, Dec 25 2013 11:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో దిగిన ఏ పారీకీ అనుకున్న రీతిలో మెజారిటీ రాకపోవడంతోజాతీయ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంలో పడిపోయింది. చివరకు రెండవ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ బాహ్య మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నద్ధత వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే బాహ్య మద్దతుదారు అయిన కాంగ్రెస్ పార్టీ ముందస్తు హెచ్చరికలు కూడా మొదలు పెట్టడంతో ప్రభుత్వ మనుగడ ఎన్నాళ్లనేది? రాజనీతిజ్ఞులనే వేధిస్తున్న ప్రశ్నగా నిలిచింది.
గడచిన 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ పేరిట కేజ్రీవాల్ వేధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్వీందర్‌సింగ్ లవ్లీ మీడియాతో స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం ప్రతి ముఖ్యమంత్రి కర్తవ్యమని కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో లవ్లీ ఈ ప్రకటన చేశారు. ‘అధికార పీఠంపై అధిష్టించే ముందు చేసే ప్రతిజ్ఞలోనే అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని ప్రజలకు భరోసా ఇచ్చినట్లు. ఇది ఆయా పార్టీల ఎన్నికల ప్రణాళికలో రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అని లవ్లీ అన్నారు. ఆప్ పార్టీకి మద్దతు విషయంలో పునరాలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు.
‘తమ పార్టీ నాయకుడు షకీల్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్‌లు డిసెంబర్ 13న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు రాసిన లేఖలో ఆమ్‌ఆద్మీ పార్టీకి తాము వెలుపలి నుంచి మద్దతు ఇస్తామని తెలిపారు.ఇందులో కాంగ్రెస్‌కు పునరాలోచన అనేది లేదు. పార్టీ శాసనసభా పక్షం సమావేశం తర్వాత మాత్రమే శాసనసభలో ఎలా వ్యవహరించాలనే విషయంపై తమ పార్టీ వ్యూహం ఖరారు చేసుకుంటాం’ అని లవ్లీ వివరించారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేజ్రీవాల్ రాసిన లేఖలో 18 అంశాలపై వైఖరి వెల్లడించాలని కోరిన విషయం ఏమిటని ప్రశ్నించగా ఈ 18 అంశాల్లో అత్యధికం అమలుకు సంబంధించిన నిర్ణయాలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాటిని అనుసరించవచ్చు అని సమాధానమిచ్చారు.
Advertisement
Advertisement