ఆప్.. ఓ ఆశాజ్యోతి!
Published Sun, Mar 9 2014 10:58 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: దేశ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తుపై ఓ నమ్మకాన్ని కల్పించిందని మహాత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ అన్నారు. 1989లో రాజీవ్‌గాంధీ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయిన తాను మళ్లీ ఇప్పుడు క్రీయాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమన్నారు. భారత రాజకీయాల్లో ఆప్ కొత్త ఒరవడిని సృష్టించిందని, అరవయేళ్లుగా తాను దేని కోసమైతే పోరాడుతున్నానో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఆప్ వేగంగా అడుగులు వేస్తోంద న్నారు. ఉత్తర ఢిల్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్‌కు ప్రత్యర్థిగా రాజ్‌మోహన్ గాంధీని బరిలోకి దింపాలని ఆప్ ఇప్పటికే నిర్ణయించింది. అన్ని విషయాలపై అవగాహన ఉన్న వ్యక్తిగా, చరిత్రకారుడిగా, అన్నింటికి మించి సామాన్య జనాల్లో పేరున్న వ్యక్తిగా చెప్పుకునే రాజ్‌మోహన్‌ను బరిలోకి దించితేనే సందీప్ దీక్షిత్‌కు గట్టి పోటీ ఎదురవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది.
ఆప్ అరంగేట్రంతో అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి పదిహేనేళ్లుగా మూల స్తంభంగా నిలిచిన షీలాదీక్షిత్ చరిత్రకు ఇప్పటికే చరమగీతం పాడిన ఆప్ ఈసారి ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్‌కు చెక్ పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సరైన ప్రత్యర్థి కోసం అన్వేషించిన ఆప్ నేతలకు రాజ్‌మోహన్ రూపంలో ఆయుధం దొరికినట్లయింది. దీంతో ఆయనను ఈసారి లోక్‌సభ ఎన్నికలో దించడం దాదాపు ఖాయమైపోయింది. ఇల్లినోయిస్ విశ్వవిద్యాలయం నుంచి రీసెర్చ్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న రాజ్‌మోహన్ తన సమయాన్ని ఇండియా, అమెరికాల మధ్య తిరగడంలోనే గడుపుతున్న సమయంలో కేజ్రీవాల్ గురించి విన్నారు. మచ్చలేని వ్యక్తిగా, నిర్భయుడిగా పలువురు కేజ్రీవాల్ గురించి చెప్పుకోవడంతో కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ విషయమై గాంధీ మాట్లాడుతూ... ‘నిజంగానే కేజ్రీవాల్ మచ్చలేని వ్యక్తి. ప్రతి విషయంలోనూ నిజాయతీగా వ్యవహరిస్తున్న ఆయన నిర్భయుడు కూడా.
రాజకీయంగా కేజ్రీవాల్ చేస్తున్న పోరాటాలు ఎందరిలోనో ఉత్తేజాన్ని నింపాయి. మరెందరికో స్ఫూర్తినిచ్చాయి. అవసరమైన సమయంలో దూకుడుగా వ్యవహరిస్తూ, సహనాన్ని కోల్పోకుండా ఆయన ముందుకెళ్తున్న తీరు చాలా గొప్పగా ఉంటోంద’ న్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి, బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ... ‘చాలామందికి నేనే ఇప్పటిదాకా ఏం చేశానో తెలియదు. కానీ ఇటీవలే వచ్చిన ఆప్ ప్రజలకు ఏం చేసిందో చాలా మందికి తెలుసు. గత కొన్ని రోజులుగా నేను చేస్తున్న ప్రచారంతో ఈ విషయం స్పష్టమవుతోంది.1989లో రాజీవ్‌కు ప్రత్యర్థిగా నేను బరిలోకి దిగినప్పుడు నా విషయంలో చాలా తక్కువగా అంచనా వేశారు. అయితే జనతాదళ్ మాత్రం నేను సరైన పోటీనిస్తానని భావించింది. అప్పట్లో బోఫోర్స్, అవినీతి వంటివాటిపై నేను చాలానే పోరాడాను. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నేనిప్పుడు తప్పకుండా గెలుస్తానని ఆప్ భావిస్తోంది. ఏదేమైనా నేనో విషయం మాత్రం చెప్పగలను.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు సాధించే విజయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక బీజేపీ గురించి చెప్పాలనుకుంటే ఆ పార్టీకి మోడీ ఓ గుర్తుగా మారిపోయారు. దేశంలోని ప్రతిమూలకు వెళ్లి ఆయన ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ పెద్దలు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. దీనినిబట్టి మోడీ ప్రచారంపై ఆ పార్టీ పెద్దల్లోనే నమ్మకమున్నట్లు కనిపించడంలేదు. అదే ఆప్ విషయానికి వస్తే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. కేవలం ఏడాది వయసున్న పార్టీ దేశవ్యాప్తంగా సత్తా చాటగలదా? అనే అనుమానం చాలామందిలో ఉంది. అయితే ఆప్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. ఇప్పటికే మారుమూల గ్రామాల్లో కూడా ఆప్ గురించి మాట్లాడుకుంటున్నారు. అనూహ్య ఫలితాలు సాధించేందుకు ఇది చాలదా?’ అని అన్నారు.
Advertisement
Advertisement