
మా ఎమ్మెల్యేలను గాలం
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు భారతీయ జనతాపార్టీ నాయకత్వం తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలమేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది.
బీజేపీపై ఆప్ ఘాటు విమర్శ
మంత్రి పదవులు ఇస్తామని మభ్యపెడుతున్నారంటూ విమర్శ
ఇప్పటికే ఐదుగురితో మాట్లాడారని ఆరోపణ
ఆప్ ఆరోపణలపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్
దొందూ దొందేనని బీజేపీ, ఆప్‌పై విమర్శ
అధికారం కోసం కుమ్ములాడుకుంటున్నారని ఎద్దేవా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు భారతీయ జనతాపార్టీ నాయకత్వం తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలమేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. తమ పార్టీకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవులను ఎరగా వేస్తోందని ఆప్ విమర్శించింది. ఢిల్లీ అసెంబ్లీపై తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించినప్పటినుంచి తమ పార్టీకి చెందిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్‌లోనే ఉందని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి మద్దతిస్తే మంత్రి పదవులతోపాటు రూ.కోట్లు గుమ్మరిస్తామని సదరు ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు గాలం వేస్తున్నారని సిసోడియా చెప్పారు. ఐదు వారాల్లోగా ఢిల్లీ అసెంబ్లీపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. కాగా, మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సంజీవ్ ఝా(బురారీ), గిరీష్‌సోనీ ((మాదీపూర్), మనోజ్‌కుమార్(కోండ్లీ),సురేందర్‌సింగ్(ఢిల్లీ కంటోన్మెంట్), రాజు ధింగన్ (త్రిలోక్‌పురి) లతో బీజేపీ నాయకులు మాట్లాడారని, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మద్దతు ఇస్తే మంత్రి పదవులతో పాటు కోట్లాది రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని సిసోడియా ఆరోపించారు. అధికారం కోసం బీజేపీ నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలో అక్రమ మార్గాన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పడరాని పాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. ఈ నెల 5వ తేదీన తనను కలవాలనకుంటున్నట్లు ఒకరు ఫోన్ చేశారని, బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తే మంత్రి పదవి కట్టబెడతామని చెప్పారన్నారు. అదేవిధంగా ఝా మాట్లాడుతూ కొందరు బీజేపీ వ్యక్తులు తనను కలిసి తమతో కలసిరావాలని కోరారని చెప్పారు. దానికి అడిగినంత సొమ్ము ముట్టజెబుతామన్నారన్నారు.
ఢిల్లీ అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆప్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణలో ఐదు వారాల్లో ఢిల్లీ అసెంబ్లీపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సూచించింది. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రానప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఇంకా సుప్తచేతనావస్థలో ఉంచడం వల్ల ఏమైనా ప్రయోజనముందా అని కోర్టు ప్రశ్నించింది. సామాన్య ప్రజలు నీళ్లు,కరెంటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ప్రజా ప్రభుత్వ ఏర్పాటుతోనే వారి ఇబ్బందులు తొలగుతాయని చెప్పింది. ఒక పార్టీ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనని చెప్పింది. మరోపార్టీ తన వల్ల కాదంది. మరో పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మంది ఎమ్మెల్యేలు లేరు.. ఇలాంటి సమయంలో ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలి? అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. అసెంబ్లీకి గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 31 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రసుత్తం ఆ పార్టీ బలం 28 సీట్లకు తగ్గిపోయింది. హర్షవర్ధన్, రమేష్ బిధురీ, పర్వేష్ వర్మ ఆ పార్టీ తరఫున ఢిల్లీనుంచి ఎంపీలుగా పోటీచేసి గెలవడంతో సదరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. శిరోమణ అకాలీదళ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు.
ఇదిలా ఉండగా, శుక్రవారం ఆప్ తన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటుచేసింది. దీనిలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు అగ్రనేతలందరూ పాల్గొన్నారు.ఇందులో తమ నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే, నగరంలో ఈ రిక్షాలపై బీజేపీ చేస్తున్న రాజకీయంపై విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది ఈ రిక్షా డ్రైవర్లను, యజమానులను బీజేపీ వంచించిందని ఆరోపించారు. ఈ రిక్షాల విషయమై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సిసోడియా డిమాండ్ చేశారు.
ఆప్ ఆరోపణలపై న్యాయవిచారణ జరపాలి
కాంగ్రెస్ పార్టీ డిమాండ్
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆప్ చేస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జాతీయ రాజధానిలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తోందని,దీని కోసం ఆప్‌కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ మంతనాలు జరుపుతోందని కాంగ్రెస్ ఈ నెల నాలుగున ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఆప్ ఆరోపణలపై న్యాయవిచారణ జరిపి, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయను వెంటనే అరెస్టు చేయాలని డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ వాసుల సమస్యలపై ఆప్, బీజేపీలకు ఎటువంటి ఆసక్తి లేదని, కేవలం అధికారం కోసమే ఆ రెండు పార్టీలు కుమ్ములాడుకుంటున్నాయని ముఖేశ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, నగరంలో ఈ రిక్షా డ్రైవర్ల భవితవ్యంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ రిక్షాల విషయంలో బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందని, నిజానికి ఆ పార్టీకి నగరంలో ఈ రిక్షాలు తిరగడం ఇష్టం లేదని ఆరోపించింది.