
'సంగీత, ఆమె భర్త చంపేస్తామని బెదిరిస్తున్నారు'
నటి సంగీత భర్త క్రిష్‌తో కలిసి తనపై హత్యా బెదిరింపులకు పాల్పడ్డారంటూ మాజీ ఐఏఎస్ అధికారి, దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహరావు పీఏ ఉషా శంకరనారాయణన్ ఆరోపించారు. స్థానిక వలసరవాక్కంలోని జానకి నగర్ వీధిలో నివశిస్తున్న ఆమె తనను దుర్బాషలాడారంటూ నటి సంగీత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
వివరాల్లోకి వెళితే....చెన్నైలోని వలసరవాక్కం జానకీ నగర్లోని ఆరో వీధిలో నటి సంగీత ఉంటున్నారు. ఇటీవలే అదే వీధిలో మాజీ ఐఏఎస్ , మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కార్యదర్శి ఉషా శంకర్ నారాయణ్ ఓ ఇంట్లోకి వచ్చి చేరారు. ఉషా శంకర్ నారాయణ్ జంతు సంరక్షకురాలు. కొన్ని కుక్కులను చేరదీసి పెంచుకుంటున్నారు. ఆ కుక్కల వల్ల తమకు ఇబ్బందిగా ఉందని నటి సంగీత అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో విషయం పోలీసులకు ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో సంగీత, ఆమె భర్త క్రిష్ 24 గంటల్లో తానను ఇళ్లు ఖాళీ చెయ్యాలని లేదంటే కుక్కలతో పాటు తనను కూడ దహనం చేస్తామంటూ హత్యాబెదిరింపులకు పాల్పడ్డారని, దీంతో తాను హైకోర్టును ఆశ్రయించానని ఉషాశంకర నారాయణన్ వెల్లడించారు.అయితే ఉషానారాయణన్ ఆరోపణలను నటి సంగీత ఖండించారు.
ఇక వీధి కుక్కలు, పెంపుడు కుక్కల వ్యవహారం సినీ నటి సంగీత - మాజీ ప్రధాని కార్యదర్శికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని దమ్మెత్తి పోసుకుంటుండంతో ఆ వీధిలోని వాళ్లకు నిద్రలేకుండా పోయింది. ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం జంతు పరిరక్షణా లేక మానవ హక్కులా అనే విషయంలో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.