ఆ రైల్వే స్టేషన్‌కు ఏం పేరు పెడతారో?
ఆ రైల్వే స్టేషన్‌కు ఏం పేరు పెడతారో?
Published Tue, Nov 22 2016 4:38 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
ముంబై: పశ్చిమ రైల్వే మార్గంలో కొత్తగా నిర్మించిన ‘ఓషివరా’ రైల్వే స్టేషన్ ప్రారంభానికిసిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ఆ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లకు హాల్టు ఇవ్వడంతో రాకపోకలు ప్రారంభమవుతాయి. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ఊరట లభించనుంది.
ఖరారు కాని పేరు..
రూ.26 కోట్లు ఖర్చుచేసి కొత్తగా నిర్మించిన ఈ స్టేషన్‌కు ఏం పేరు పెట్టాలనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఈ స్టేషన్ ఓషివరా ప్రాంతంలో ఉండడంవల్ల అదే పేరుతో పిలుస్తున్నారు. ఈ పేరే పెట్టాలని కొందరు స్థానికులు కోరుతుండగా ‘రాం మందిర్’ అని నామకరణం చేయాలని బీజేపీ వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రారంభోత్సవానికి ముందే స్టేషన్ బయట పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ బోర్డులు, ప్లాట్‌ఫారాలపై వివిధ రకాల బోర్డులు, ఇండికేటర్లు, స్టేషన్ కోడ్, అనౌన్స్‌మెంట్ వంటి రకరకాల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. టికెట్లు ఏ స్టేషన్ పేరుతో ఇవ్వాలో ముందే నిర్ణయిస్తే అన్ని స్టేషన్‌లలో టికెట్ జారీచేసే కంప్యూటర్లలో మార్పులు చేయడానికి వీలుపడుతుందని సిబ్బంది అంటున్నారు. సమయం దగ్గర పడుతోంది. కాని, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోకపోవడంతో రైల్వే సిబ్బంది, అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement