మద్యంపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
మంత్రి వ్యాఖ్యలతో బట్ట బయలు
దశలవారీ నిషేధానికి ప్రతి పక్షాల పట్టు
జల్లికట్టు కోసం ఒత్తిడి
ప్రతి పక్షాల వాకౌట్
సాక్షి, చెన్నై : మద్య నిషేధం విషయంలో అన్నాడీఎంకే సర్కారు నిర్ణయం బట్ట బయలైంది. నిషేధ నినాదాన్ని ఉక్కు పాదంతో అణగదొక్కేందుకే మొగ్గు చూపుతుండడం స్పషమవుతోంది. ఇందుకు గురువారం అసెంబ్లీ వేదికగా మంత్రి నత్తం విశ్వనాథన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. అయితే, ఒకే సారిగా కాకుండా, దశల వారీగా మద్య నిషేధానికి ప్రతి పక్షాలు పట్టుబట్టినా, ఇక చాలు అంటూ ఆ చర్చకు స్పీకర్ ధనపాలన్ మోకాలొడ్డారు. తదుపరి జల్లికట్టు కోసం ప్రత్యేక తీర్మానం నినాదాన్ని అందుకున్న ప్రతి పక్షాలు వాకౌట్ల పర్వాన్ని సాగించాయి.
రాష్ట్రంలో మద్య నిషేధం అమలు నినాదంతో ఆది నుంచి రాందాసు నేతృత్వంలోని పీఎంకే ఉద్యమిస్తూ వచ్చింది. తదుపరి ఒక్కో పార్టీ ఈ నినాదాన్ని అందుకోవడం మొదలెట్టాయి. ఎండీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు ఒకరి తర్వాత మరొకరు గళం ఎత్తడంతో రాష్ట్రంలో మద్య నిషేధ నినాద ఉద్యమం బయలు దేరింది. ఈ ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకున్న డీఎంకే తాము సైతం అంటూ ముందుకు వచ్చింది. అధికారంలోకి రాగానే, తొలి సంతకం అన్న ప్రకటనను సైతం ఆ పార్టీ చేసింది. అయితే, అన్నాడీఎంకే సర్కారు మాత్రం మద్యానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఉద్యమాన్ని అణగదొక్కే
ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నది.
ఇక, మద్య నిషేధం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని బహిర్గతం చేయాలని ప్రతి పక్షాలతో పాటుగా ఉద్యమ కారులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం మొదలెట్టాయి. ఈ పరిస్థితుల్లో గురువారం అసెంబ్లీ వేదికగా ఎక్సైజ్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా తాము మద్య నిషేధానికి వ్యతిరేకం అన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. నిషేధానికి నో చాన్స్ : అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఉదయం గవర్నర్ రోశయ్య ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ చర్చ సాగింది. తొలుత డీఎండీకే సభ్యుడు పార్థసారథి తన ప్రసంగంలో రాష్ర్టంలో ఏరుై లె పారుతున్న మద్యం వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ వ్యాఖ్యలు సంధించారు. ప్రజల్ని మద్యానికి బానిసల్ని చేస్తున్నారని తీవ్రంగా శివాలెత్తారు. తదుపరి డీఎంకే శాసన సభా పక్ష ఉప నేత దురై మురుగన్ ప్రసంగిస్తూ, మద్య నిషేధం విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. మద్య నిషేధం అమలు చేయడంలో ప్రభుత్వానికి ఎందుకు అంత కష్టం అంటూ తీవ్రంగానే ధ్వజమెత్తారు.
దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తే , ఆదాయం అంతా పక్కనే ఉన్న పాండిచ్చేరికి పోతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చూస్తూ..చూస్తూ ఆదాయాన్ని పక్క రాష్ట్రానికి దారాదత్తం చేయగలమా..? అని ఎదురు ప్రశ్న వేస్తూ, మద్య నిషేధం దేశ వ్యాప్తంగా అమల్లోకి వస్తే, అప్పుడు రాష్ట్రంలో అమలు విషయంగా ఆలోచిద్దామని వ్యాఖ్యానించారు. ఇంతలో డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ అందుకుని కనీసం దశల వారీగా అమలుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, సీపీఐ, సీపీఎం నేతలు ఆర్ముగం, సౌందరరాజన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ ధరణి తమ ప్రసంగాల్లో ఆలయాల వద్ద, స్కూళ్ల వద్ద ఉన్న మద్యం దుకాణాల్ని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ధనపాల్ అందుకుని, ఇప్పటికే మంత్రి సమాధానం ఇచ్చేశారని, అలాంటప్పుడు ఇక ఈ నిషేధం చర్చ అనవసరం అంటూ ముగించడం గమనార్హం.
జల్లికట్టుకు పట్టు : ఈ చర్చకు ముగింపు పలకగానే, జల్లికట్టు అనుమతికి ప్రత్యేక తీర్మానం కోసం ప్రతి పక్షాలన్నీ పట్టుబట్టాయి. సంప్రదాయ, సాహస క్రీడ కోసం ప్రత్యేక తీర్మానం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంగా తమకు మాట్లాడే అవకాశాలు ఇవ్వాలని ప్రతి పక్షాలు స్పీకర్‌ను కోరాయి. ఇందుకు ఆయన నిరాకరించడంతో సభలో నినాదాలు మర్మోగాయి. తిరువొత్తియూరు అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుప్పన్ అందుకుని డీఎంకేకు చిత్త శుద్ది లేదు అని, కరుణానిధి కపట నాటకాల్లో దిట్టా అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించడం మొదలెట్టారు. ఆయన వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. ఇందుకు కూడా స్పీకర్ నిరాకరించడంతో ఆగ్రహించిన డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తదుపరి సీపీఎం, సీపీఐ, పుదియ తమిళగం, కాంగ్రెస్‌లు సభ నుంచి వాకౌట్ చేశాయి. అదే సమయంలో ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం అందుకుని జల్లికట్టు విషయాన్ని సీఎం పరిగణించి ఉన్నారని, వ్యవహారం కోర్టులో ఉన్నందున ఆచితూచి అడుగులు వేస్తూ చర్యలు చేపట్టి ఉన్నారని వ్యాఖ్యానించారు.
నిషేధానికి నో
Published Fri, Jan 22 2016 2:27 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
Advertisement
Advertisement