మోదీ తీరు నిరాశ కలిగించింది: అన్నాడీఎంకే ఎంపీ
న్యూఢిల్లీ: గత ఏడాదికాలంగా తమ ఎంపీలు అనేకసార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కోరారని, కానీ ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నాడీఎంకే నేత తంబిదురై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తీరు తమకు నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. జల్లికట్టు ఆర్డినెన్స్‌కు వెంటనే ఆమోదం తెలుపాలని కోరుతూ అన్నాడీఎంకే ఎంపీలు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అనుమతించే ఆర్డినెన్స్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు. అనంతరం అన్నాడీఎంకే నేత తంబిదురై విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు (శనివారం) సాయంత్రంలోగా జల్లికట్టుపై ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు ఆయన తెలిపారు.
జల్లికట్టు అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, దీంతో ఈ అంశాన్ని పరిష్కరించాలని దివంగత అమ్మ (జయలలిత) గతంలో కేంద్రాన్ని కోరానని, కానీ కేంద్రం తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష డీఎంకే చాలాకాలం అధికారంలో ఉన్నా ఈ అంశాన్ని వారు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వారి నిష్క్రియపరత్వం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.