ప్రధాని మోదీకి శశికళ లేఖ
చెన్నై: జల్లికట్టును అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ కోరారు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం ఆమె లేఖ రాశారు. ప్రధాని వెంటనే జోక్యం చేసుకుని అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు తమిళనాడులు సంప్రదాయ క్రీడ, సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని నిర్వహించడం పండగలో భాగంగా పరిగణిస్తారని లేఖలో శశికళ పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ విషయంపై ఇంతకుముందే ప్రధాని మోదీకి లేఖ రాశారు. అన్నాడీఎంకే ఎంపీలు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ దవేను కలిసి జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో పొంగల్‌ను తప్పనిసరి సెలవుగా ప్రకటించాలని కోరుతూ అన్నాడీఎంకే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పొంగల్‌ను తప్పనిసరి సెలవుగా మోదీ సర్కారు ప్రకటించింది.