కలుస్తున్నారు.. డిప్యూటీ సీఎంగా పన్నీర్!
సాక్షి, చెన్నై : తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనీ స్వామిని(ఈపీఎస్) తిరిగి అదే బాధ్యతల్లో కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వాన్ని(ఓపీఎస్) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కట్టబెట్టే విషయంలో ఇరు వర్గాలు అంగీకరించినట్లు కీలక వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఇక త్వరలోనే కలిసిపోనున్నాయని తెలుస్తోంది. పన్నీర్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతోపాటు ప్రభుత్వంలో ప్రాధాన్యమున్న ఆర్థికశాఖ, పౌరసరఫరాలశాఖలు కట్టబెట్టనున్నారట.
అలాగే, పన్నీర్ వర్గానికి చెందిన సెమ్మాలై, మాఫక్షయి పాండ్యరాజన్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకొని ఆరోగ్యశాఖగానీ, పరిశ్రమలకు సంబంధించిన శాఖలుగానీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే, మంత్రి డీ జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15కంటే ముందే ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు కలిసిపోనున్నాయని చెప్పారు. నిజంగానే ఓపీఎస్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు ఇస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు మాత్రం మౌనం వహించారు.
ఇప్పటికే, దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ, ఆమె అక్క కొడుకు దినకరన్‌కు అధికార అన్నాడీఎంకే షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దినకరన్‌పై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేసింది. అన్నాడీఎంకే డీప్యూటీ సెక్రటరీ జనరల్‌గా దినకరన్ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ తీర్మానం చేసింది. ఈ తీర్మానం అన్నాడీఎంకేలో కీలక పునరేకీకరణకు మార్గం సుగమం చేసిందని భావిస్తున్నారు.