ఈ చెలిమి గెలుస్తుందా?
తమిళనాట ఆర్నెల్లనాడు మొదలై ఎడతెగకుండా సాగుతున్న అసంబద్ధ రాజకీయ నాటకానికి ఎట్టకేలకు తెరపడింది. అన్నా డీఎంకేకు చెందిన ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గాలు రెండూ సోమవారం విలీనమ య్యాయి. పార్టీ పగ్గాలను పన్నీర్‌సెల్వం, ప్రభుత్వ సారథ్యాన్ని పళనిస్వామి చేపట్టాలని ఇరుపక్షాలూ ఒప్పందానికొచ్చాయి. పన్నీర్‌సెల్వానికి పార్టీ పగ్గాలు మాత్రమే కాదు... అదనంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆయనకు కీల కమైన ఆర్ధిక శాఖతోపాటు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, ప్లానింగ్, శాసనసభా వ్యవహారాలు వంటి అరడజనుకు పైగా శాఖలు కేటాయించారు.
అన్నా డీఎంకే అధినేత జయలలిత మరణించాక ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పన్నీర్ సెల్వం రెండు నెలల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఆ పదవిని వదులుకుని తానే స్వయంగా శశికళను ప్రతిపాదించి ఆమె ఏకగ్రీవ ఎన్నికకు దోహదపడ్డారు. మరికొన్ని రోజులకే తిరుగుబాటు చేశారు. అమ్మ జయలలిత ఆత్మ ఆదేశించడం పర్యవసానంగానే ఇదంతా చేస్తున్నానని ప్రకటించి కలకలం సృష్టించారు. మళ్లీ ఆ పదవిని పొందడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. ఈలోగా శశికళ జైలుపాలు కావడంతో ఆమె వర్గం తరఫున పళనిస్వామి తెరపైకి వచ్చారు. తన శిబిరంలోని ఎమ్మెల్యేలను చెదరగొట్టడానికీ, బలహీనపర్చడానికీ ఎవరెన్ని ఎత్తుగడలు పన్నినా పళనిస్వామి నిబ్బరంగా ఎదుర్కొని చివరకు విశ్వాస పరీక్షలో విజయం సాధిం చారు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు అందరికీ అర్ధమయ్యాయి. అధికార కుమ్ములాటలుండే ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఎత్తులు, పైయెత్తులు సర్వసాధార ణమే. కానీ ఆ తర్వాతే చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి.
తమిళనాడు రాజకీయాలు విలక్షణమైనవి. సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం... ఆ వీరాభిమానం రాజకీయ రంగానికి కూడా బదిలీ కావడం అక్కడ కనబడే ధోరణి. రాష్ట్రంలో మొదటినుంచీ ద్రవిడ ఉద్యమం బలంగా ఉండటం వల్ల ఈ ధోరణికి మరింత ఊపు వచ్చింది. జయలలిత మరణానంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఈ విలక్షణతకు కూడా భిన్నమైనవి. నిన్నమొన్నటి వరకూ పన్నీర్, పళని వర్గాలు కత్తులు నూరుకున్నాయి. అవినీతి పరురాలైన శశికళ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారని పళనిపై పన్నీర్ నిప్పులు చెరిగితే...అందుకు దీటుగా ఆ వర్గం స్పందించింది. అమ్మ వారసులం మేమే నంటూ ఇరు పక్షాలూ వీధికెక్కాయి. అయితే ఉన్నట్టుండి అవి రెండూ స్వరం తగ్గించాయి.
అమ్మ కలలు నెరవేర్చడం కోసం కలిసి పనిచేస్తామని సంకేతాలివ్వడం ప్రారంభించాయి. ఫిబ్రవరిలో జరిగిన విశ్వాస పరీక్షలో కేవలం 11 ఓట్లు మాత్రమే సంపాదించిన పన్నీర్ సెల్వాన్ని 122మంది ఎమ్మెల్యేల బలం ఉన్న సీఎం పళని స్వామి కలిసుందాం... రమ్మని అభ్యర్ధించడం, ఆయన షరతులు విధిస్తూ పోవడం, మొదట బెట్టు చేసినట్టు కనబడిన పళని ఒక్కో మెట్టే దిగుతూ దాదాపుగా అన్ని డిమాండ్లకూ అంగీకారం తెలపడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. శశికళ జైలు పాలయ్యాక తన బంధువు టీటీవీ దినకరన్‌ను విశ్వాసపాత్రునిగా ఎంచుకుని ఆయనకు పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవి కట్టబెట్టారు. అది పళనికి ఆగ్రహం కలిగించి ఉండొచ్చుగానీ... అందుకు బలహీనుడిగా మిగిలిన పన్నీర్ సెల్వంతో చేతులు కలపడం వల్ల ఆయనకు ఒరిగేదేమీ ఉండదు.
దినకరన్ శిబి రంలో 28మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష డీఎంకే సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, వారికి దినకరన్ వర్గం మద్దతుగా నిలిస్తే ప్రభుత్వం కుప్ప కూలుతుంది. అయినా ఆయన పన్నీర్‌ను ప్రాధేయపడ్డారు తప్ప దినకరన్‌తో ఏదో రకమైన సర్దుబాటుకు సిద్ధపడదామనుకోలేదు. ఏమైతేనేం ఇప్పుడు పళని, పన్నీరు వర్గాలు కలిసిపోయాయి. పన్నీర్‌సెల్వం డిమాండు మేరకు జయలలిత మరణంపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలన్న మరో కీలక డిమాండు మాత్రం పెండింగ్‌లో పడింది. అందుకు పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం తప్పనిసరని చెబుతున్నారు. ఆ ప్రక్రియ సజావుగా పూర్తి కావడం పళనిస్వామికి పెద్ద సవాలే.
తమిళనాట జరుగుతున్న పరిణామాల్లో తమ ప్రమేయం లేదని బీజేపీ నాయకత్వం చెబుతోంది. అయితే అలాంటి బలమైన శక్తేదో లేకుండానే ఆ రాష్ట్రంలో ఈ మాదిరి పరిణామాలు చోటుచేసుకుంటాయంటే ఎవరూ నమ్మ జాలరు. నిజానికి కొన్ని రోజుల క్రితం బిహార్‌లో జరిగిన పరిణామాలు కూడా ఆశ్చర్యకరమైనవే. అక్కడ అధికార పక్షమైన జేడీ(యూ)...తన కూటమిలోని భాగస్వామి ఆర్జేడీని బయటకు నెట్టి కొత్త భాగస్వామి బీజేపీని తెచ్చుకుంది. తమిళనాడులో ఇప్పుడు ఏర్పడ్డ కొత్త చెలిమి పర్యవసానంగా అంతా సర్దు కుంటుందని, ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని భావించడానికి లేదు. పన్నీర్ సెల్వం మొన్న ఫిబ్రవరిలో అమ్మ పేరు చెప్పి ప్రత్యర్ధి వర్గంపై విరుచుకు పడినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచిన కమల్‌హాసన్ తదితర సినీ నటులు ఇప్పుడు తాజా విలీనాన్ని హేళన చేస్తున్నారు.
తమిళ ప్రజల నెత్తిన టోపీ పెడు తున్నారంటూ కమల్ వ్యాఖ్యానించారు. డీఎంకే పెట్టబోయే అవిశ్వాస తీర్మానం సంగతలా ఉంచి తమిళ ప్రజలు ఈ వింత పరిణామాలను ఎలా చూస్తున్నారనేది ప్రశ్న. అన్నాడీఎంకేలో గౌండర్, తీవర్ రెండూ బలమైన కులాలు. జయలలిత బలమైన నాయకురాలు గనుక ఈ రెండు కులాలకు తగినంత ప్రాధాన్యమిచ్చి పార్టీ వెనక దృఢంగా ఉండేలా చూసుకోగలిగారు. ఆ స్థాయిలో పళని, పన్నీర్‌లు పార్టీని పటిష్టంగా నడపగలరా అన్నది సందేహమే. పళనిస్వామి గౌండర్ అయితే పన్నీర్ తీవర్ కులస్తుడు. రాజకీయ సుస్థిరత లేనప్పుడు పాలన కుంటుబడుతుంది. ఫలి తంగా ప్రజలు ఇబ్బంది పడతారు. తమిళనాడులో గత ఆర్నెల్ల పరిణామాలు దీన్నే రుజువు చేశాయి. ఇప్పుడు కుదిరిన సఖ్యత ఎంతవరకూ దాన్ని మెరుగుపరచ గలదో చూడాలి.