పళని, పన్నీరు మధ్య రాజీ కుదిరిందా?
చెన్నై: అన్నా డీఎంకేలో రెండు వర్గాల మధ్య విలీన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయా? తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల మధ్య రాజీ కుదిరిందా? ఈ రెండు గ్రూపులు త్వరలో విలీనం కానున్నాయా? అంటే అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్ అయ్యే వరకు ఆగాలని ఇరు వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
పళని స్వామి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేలా, పన్నీరు సెల్వానికి పార్టీ పగ్గాలు అప్పగించేలా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాగా దినకరన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఇరు వర్గాల మధ్య అధికారికంగా చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. పార్టీ గుర్తు 'రెండాకులు' కో్సం ఈసీకి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మూడు రోజులుగా దినకరన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి శశికళ, దినకరన్‌లను బహిష్కరించడంతో పాటు జయలలిత మృతిపై విచారణకు అంగీకరిస్తేనే విలీన చర్చలు జరుపుతామని సోమవారం వరకు పన్నీరు సెల్వం వర్గీయులు చెప్పారు. అలాగే పన్నీరుకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. తాజాగా పన్నీరుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారని, పళని సీఎంగా కొనసాగుతారని, దినకరన్ అరెస్ట్ అయిన తర్వాత రెండు వర్గాలు విలీనమవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.