రెండు కుర్చీలపై శశికళే!
► పార్టీ సాంప్రదాయమని వాదన
► సీఎం, ప్రధాన కార్యదర్శిగా శశికళ
► 127 మంది మృతుల కుటుంబాలకు తలా రూ.3లక్షలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన సీఎం, ప్రధాన కార్యదర్శి.. ఈ రెండు కుర్చీల్లోనూ శశికళను కూర్చోబెట్టడమే ఆనవాయితీ అనే వాదనతో అన్నాడీఎంకే శ్రేణులు అడుగులు వేస్తున్నాయి.జయలలిత మరణించగానే ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం ఎంపిక ఎటువంటి వివాదానికి తావు లేకుండా ఏకగ్రీవంగా సాగిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి భర్తీపై మాత్రం కొన్నిరోజులుగా తర్జనభర్జనలు జరిగినా క్రమేణా పార్టీ ఏకతాటిపై నిలిచి శశికళకు మద్దతు పలుకుతోంది. వారం రోజులు గా రాష్ట్రవ్యాప్తంగా తీర్మానాలు సైతం చేస్తూ వచ్చారు. అయితే రెండు రోజుల క్రితం అన్నాడీఎంకేలో అకస్మాత్తుగా సీ ను మారిపోయింది. పార్టీ బాధ్యతలతోపాటూ ప్రభుత్వ పగ్గాలు సైతం శశికళ చేపట్టాలని కోరడం ప్రారంభమైంది. ఈ మేరకు తీర్మానాలు కూడా చేసి శశికళకు సమర్పిస్తున్నారు. చివరకు పన్నీర్‌సెల్వం కేబినెట్‌లోని మంత్రి వర్గ సహచరులు సైతం చిన్నమ్మే సీఎం కావాలని పట్టుబట్టడం విచిత్రం.
ఇదేమి చోద్యం, సీఎం పన్నీర్‌సెల్వంకు మీరు వ్యతిరేకమా అని ప్రశ్నించిన మీడియాకు మంత్రి ఉదయకుమార్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పన్నీర్‌సెల్వంతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. జయ సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నపుడు మాత్రమే పన్నీర్‌సెల్వంకు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. పార్టీకి నాయకత్వం వహించేవారే ప్రభుత్వాన్ని నడిపించడం అన్నాడీఎంకేలో ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అంతేగాక సీఎం పన్నీర్ సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండే శశికళ వద్దకు పదేపదే వస్తే ప్రజల్లో విమర్శలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రెండు బాధ్యతల్లోనూ శశికళ ఉండడం ఉత్తమమని భావించే మంత్రులంతా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా అమ్మ సమాధిని దర్శించుకునేందుకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం సైతం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి అమ్మకు అంజలి ఘటించారు. మీంజూరుకు చెందిన అన్నాడీఎంకే నేత ముత్తుకుమార్ అమ్మ సమాధి వద్ద ఆమె విగ్రహాన్ని అమర్చారు. జయలలిత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 127 మృతుల కుటుంబాలకు తలా రూ.3 లక్షలు అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
జయ మరణంపై సందేహాలు: జీకే వాసన్
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జయ మరణాన్ని రాజకీయం చేయడం సరికాదు, అలాగని గోప్యంగా ఉంచడం కూడా మంచిది కాదని అన్నారు. ప్రజల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం వెనకడుగు వేయరాదని ఆయన హితవు పలికారు.