
పేదపిల్లలూ... చదువుకోండి
సమున్నత భవిష్యత్తుకోసం చదువుకోవాలని బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్... నిరుపేద చిన్నారులకు పిలుపునిచ్చాడు. తద్వారా తమ జీవనప్రమాణాలను పెంచుకోవాలన్నాడు.
సమున్నత భవిష్యత్తుకోసం చదువుకోవాలని బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్... నిరుపేద చిన్నారులకు పిలుపునిచ్చాడు. తద్వారా తమ జీవనప్రమాణాలను పెంచుకోవాలన్నాడు. ‘మన దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉంది. మీరంతా బడికి వెళ్లాలని, మీ భవితవ్యాన్ని మెరుగుపరుచుకోవాలని విన్నవిస్తున్నా’ అని అన్నాడు. మహిళ, శిశు సంక్షేమ విభాగం, గిరిజన అభివృద్ధి శాఖల సంయుక్త సహకారంతో ముంబై పోలీస్ అసోసియేషన్...దక్షిణ ముంబైలోని విద్యాభవన్ ఆడిటోరియంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ‘పరివర్తన్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అజయ్ మాట్లాడాడు. నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన 45 ఏళ్ల అజయ్ హితవు పలికాడు.
‘ఎటువంటి ఆటంకాలు కలగకుండా వీరంతా చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వ అధికారులు తమవంతు సహకారం అందిస్తారు. అందువల్ల విద్యపరంగా అభివృద్ధి చెందేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోండి. మీ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే స్వచ్ఛంద సంస్థలు వారికి ఉపాధి అవకాశాలు లభించేలా తమవంతు సహకారం అందిస్తారు. ఇలా పాఠశాలల్లో చేరిన విద్యార్థులు ఏకారణం చేతనైనా మధ్యలోనే మానితే నాతోపాటు స్వచ్ఛంద సంస్థలు చేసిన కృషి వృథా అవుతుంది’ అని అనానడు. కాగా నగరంలోని బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందించాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు అందించిన గణాంకాల ప్రకారం నగరంలోని ఒక్క దక్షిణ ముంబై ప్రాంతంలోనే 1,233 మంది పిల్లలు బిచ్చమెత్తి జీవిస్తున్నారు.