విలన్ పాత్రకే నా ఓటు: అక్షయ్
యాక్షన్, కామెడీ పాత్రలతోపాటు అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తేనే ఆనందంగా ఉంటుంద’ని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. సినిమాల్లో విలన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నాడు. ‘సినిమాలో అందరికంటే ఎక్కువ సేపు కనిపించేది విలనే.. హీరోయిన్ వెనుక ఎక్కువ తిరిగే ఛాన్స్ హీరోకన్నా విలన్‌కే ఉంటుంది..హీరోకు తన చెల్లి, తల్లి కోసం కష్టపడటం, వారిని రక్షించుకోవడంతోనే సమయం అంతా గడిచిపోతుంది.. కాకపోతే విలన్ చివరి ఐదు నిమిషాలు హీరో చేతిలో దెబ్బలు తింటాడు అంతే..’ అంటూ విలన్ పాత్ర తనకు ఎందుకు ఇష్టమో ఈ సూపర్ హీరో చెప్పుకొచ్చాడు.
తన రాబోయే సినిమా ‘ఎంటర్‌టైన్‌మెంట్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. దేశవ్యాప్తంగా అక్షయ్ అభిమానులను ఈ నెల 8వ తేదీన ‘ఎంటర్‌టైన్‌మెంట్’ చేయనుంది. అక్షయ్‌కు మంచి కామెడీ, యాక్షన్ హీరోగా పేరుంది. కాగా, కామెడీ చేయడమంటే తనకు చాలా ఇష్టమని అక్షయ్ చెప్పాడు. హాస్యంలో పలు రకాలున్నాయని, వాటి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నాడు. కాగా, ప్రకాష్ రాజ్ చేసే కామెడీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆతరహా హాస్యం పండించడానికి కష్టపడతానని చెప్పాడు. తన 27 యేళ్ల సినీ ప్రస్థానంపై అతడు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ‘ఈ రోజుకీ నేను ఉదయం లేవగానే షూటింగ్‌కు వెళ్లేందుకు చాలా ఉత్సుకత చూపిస్తాను.
ఈ వృత్తి నాకు చాలా బాగా నచ్చింది.. మున్ముందు కూడా నా వృత్తిపట్ల అంకిత భావంతోనే పనిచేస్తా’నన్నాడు. ఒక జీవితకాలంలో అనేక పాత్రలను పోషించగలిగే అవకాశమున్న ఏకైక వృత్తి నటన అని ఆయన వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చేశా.. వాటిలో వివిధ పాత్రలను పోషించా.. నటనా వృత్తిలో మనం ఎంతోమంది అమ్మాయిలతో రొమాన్స్ చేయవచ్చు (నవ్వుతూ..) ఎన్నో ఆటలు ఆడొచ్చు.. పోలీస్ ఆఫీసర్ అవ్వొచ్చు.. విలన్‌గా మారొచ్చు.. ఏ పాత్ర చేసినా డబ్బులు మాత్రం వస్తాయి.. అందుకే ఈ వృత్తి అంటే నాకు ప్రాణం..’ అంటూ నవ్వుతూ ముక్తాయించాడు.