రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కమలనాథులు మళ్లీ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు అమిత్‌షా వచ్చేనెల 5న మళ్లీ చెన్నై చేరుకుంటున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఉత్తరాదిలో పార్టీ బలం పుంజుకోగా దక్షిణాదిలో సైతం కాషాయజెండాను రెపరెపలాడించేందుకు బీజేపీ తహతహలాడుతోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాడే ద క్షిణాదిపై కన్నేసిన కమలనాథులు ముందుగా తమిళనాడును ఎంచుకున్నారు. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోకి తమిళనాడులో పార్టీ బలం పెరగడం, అంతేగాక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపించడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. గడిచిన పార్లమెంటు ఎన్నికలో రాష్ట్రంలో బలమైన కూటమిని ఏర్పాటు చేసుకున్న బీజేపీ ఇదే సూత్రాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అమలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన కమిటీ బీటలు వారింది. ప్రాంతీయ తత్వం లేనిదే రాష్ట్రంలో రాణించడం అసాధ్యం కాబట్టి కూటమిని బలపరచడం బీజేపీకి తప్పదు.
మూడోసారి అమిత్‌షా: ఎన్నికల వ్యూహంలో మోదీ నుంచి మంచి మార్కులు కొట్టేసిన అమిత్‌షా తమిళనాడుకు రావడం ఇది మూడోసారి. గత ఏడాది మొదటి సారి వచ్చినపుడు మరైమలైనగర్‌లో బహిరంగ సభలో పాల్గొని రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులను పార్టీలో చేర్చుకున్నారు. గత నెల ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆనాటి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అమిత్‌షా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సుడిగాలి పర్యటన చేస్తూ మిస్డ్ కాల్ ఇవ్వండి..పార్టీలో చేరండనే నినాదాన్ని ప్రచారం చేశారు. ఇంటర్నెట్ ద్వారా సభ్యులను చేర్చుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి తేచ్చేందుకు వీలుగా గతంలోనే పార్టీ సభ్యత్వ నమోదు విభాగాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబరు 1 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో నకిలీ సభ్యత్వ నమోదు సాగినట్లు ఆరోపణలు వచ్చాయి. నకిలీలను అడ్డుకునేందుకు సభ్యులను నేరుగా చూసిగానీ సభ్యత్వ గుర్తింపు కార్డును జారీచేయరాదని అమిత్‌షా ఆదేశించారు. తమిళనాడులో సైతం సభ్యత్వ నమోదు కార్యక్రమం సాగుతుండడంతో ఇతర రాష్ట్రాల్లో వెలుగుచూసినట్లుగా నకిలీలను అరికట్టడమే అమిత్‌షా పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. మార్చి ఆఖరులోగా సభ్యత్వ నమోదును పూర్తిచేయాలని పార్టీ ఆదేశించింది. రికార్డు స్థాయిలో సభ్యులను చేర్చుకోవాలని రాష్ట్ర శాఖ పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు చేర్చిన సభ్యుల వివరాలను పరిశీలించడంతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులతో మార్చి 5న సమావేశం కానున్నట్లు తెలిసింది.
కమలనాథుల కసరత్తు
Published Sun, Feb 22 2015 3:05 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM
Advertisement