అమ్మవారి జాతరలో అపశ్రుతి
= అగ్నిగుండంలో పడిన భక్తులు
= 70 మందికి గాయాలు
తుమకూరు : అమ్మవారి జాతరకు వచ్చిన భక్తులందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయం ముందు ఉన్న అగ్ని గుండంలో మంటలు ఇంతెత్తున ఎగరిపడుతున్నాయి. మరో వైపు గుండంలోకి దిగి మొక్కులు తీర్చుకోవాలని భక్తులు బారులు తీరారు. ఇంతలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో గుండంలోకి పడిపోయారు. దీంతో హాహాకారాలు మిన్నంటాయి. పోలీసులు, స్థానికులు అప్రమత్తమై గుండంలోకి దిగిన 70 మందిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. వివరాలు..తుమకూరు జిల్లా, హెతైనహళ్లిలో మారెమ్మ దేవి కొలువైంది. ఆనవాయితీగా శివరాత్రి పర్వదినం మరుసటి రోజు మంగళవారం ఉదయం జరిగే అమ్మవారి జాతరకు కమ్మంజిపాళు, రంగయ్యపాళ్య, కంబత్తనహళ, లక్ష్మణసంద్ర, కైదాల తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. ఈక్రమంలో తెల్లవారు జామున దేవాలయం ముందు ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడిచి మొక్కులు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులను నియంత్రించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
4.45 గంటలకు మడి కట్టుకున్న భక్తులు కుమ్మంజిపాళ్య గ్రామానికి చెందిన నాగరాజు, రంగయ్యనపాళ్య గిరిష్ పూజలు నిర్వహించి నిప్పుల్లో దిగి నడిచి వెళ్లారు. వారి వెనక క్యూలో నిలబడి ఉన్న వందలాది మంది ఒక్క సారిగా ముందుకు రాగా తోపులాట జరిగింది. సుమారు 70 మంది భక్తులు నిప్పుల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు అప్రమత్తమై గుండంలో పడినవారిని బయటకు తీసి వాహనాల్లో తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని బెంగళూరులోని విక్టోరియా తరలించారు. తుమకురు గ్రామీణ ఎమ్మెల్యే బీ.సురేష్‌గౌడ, మాజీ ఎమ్మెల్యే హెచ్.నింగప్ప, టిపి సభ్యుడు శివకుమార్, తుమకూరు ఉప విభాగం అదికారి తబ్సుమ్ జహెరా, తహశీల్దార్ కాంతరాజు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. తుమకూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.రఫిక్ ఆహ్మద్ ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ప్రాణ హాని లేదన్నారు. ఎమ్మెల్యే సురేష్‌గౌడ మాట్లాడుతూ ఈ ప్రమాదం దేవాదాయశాఖ, జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. కారకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మోహన్‌రాజు ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం దేవాలయం వద్దకు వెళ్లి ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందని అధికారులను ఆరా తీశారు.