
అందుకే మాస్ చిత్రంలో లేను
కోలీవుడ్‌లో ఉజ్వల భవిష్యత్‌కు పునాదులు వేసుకుంటున్న ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్. మదరాసు పట్టణం సినిమాతో నాయికగా తన కేరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తరువాత తాండవం చిత్రంలో విక్రమ్‌తో జతకట్టింది. అటుపై బాలీవుడ్‌పై కన్నేసినా అక్కడ తొలిచిత్రమే నిరాశపరచడంతో మళ్లీ అటు వైపు చూడలేదు. అలాంటి సమయంలో స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించే లక్కీ చాన్స్ వచ్చింది. విక్రమ్ త్రిపాత్రాభినయంతో శంకర్ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆస్కార్ ఫిలింస్ భారీ నిర్మాణ విలువలతో తెరపై ఆవిష్కృతమైన ‘ఐ’ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నారుు.
ఈ చిత్రం పూర్తి కాగానే ఎమీకి సూర్యతో మాస్ చిత్రంలో నటించే మరో మంచి అవకాశం వచ్చింది. అయితే ముందు ఆ చిత్రాన్ని చెయ్యడానికి అంగీకరించినా ఆ తరువాత ఎమీజాక్సన్ చిత్రం నుంచి వైదొలగింది. కారణం ఆ చిత్రంలో నటిస్తున్న మరో నాయకి నయనతారనే ప్రచారం మొదలైంది. అయితే ఎమీ వివరణ మాత్రం వేరేగా ఉంది. ఆమె ఆ చిత్ర ద ర్శకుడు వెంకట్‌ప్రభు క థలో మార్పులు చేశారని అందులో తన పాత్ర కు ప్రాధాన్యం తగ్గిపోవడంతో, మాస్ చిత్రం నుంచి వైదొలగానని పేర్కొంది.
ఐ చిత్రంలో నటించిన తరువాత ఇకపై మంచి కథా చిత్రాలను ఎంచుకుని నటించాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది కూడా మాస్ చిత్రం నుంచి తప్పుకోవడానికి కారణం అని పేర్కొంది. అయితే భవిష్యత్తులో సూర్యతో నటించే అవకాశం వస్తే వదలుకోనన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉదయనిధి స్టాలిన్‌తో జతగా ఒక చిత్రం చేయనున్నానని, ఇందులో తనది గ్రామీణ పాత్ర అని పేర్కొంది. దీంతో అప్పటి నుంచే చీర కట్టుకోవడం నేర్చుకుంటున్నానని పేర్కొంది. అదే విధంగా త్వరలో వేల్‌రాజ్ దర్శకత్వంలో ధనుష్ సరసన ఓ చిత్రం చేయనున్నట్లు ఎమీ పేర్కొంది.