
మరో వాయుగుండం!
రాష్ట్రంలో 4 నుంచి భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాల ప్రవేశం
సాక్షి, విశాఖపట్నం/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వాయుగుండం వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడవచ్చని దీనిప్రభావం ఈ నెల మూడో తేదీ నుంచి కనిపిస్తుందని వివరించింది.
తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మరోవైపు రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గడచిన 24 గంటల్లో బెస్తవారిపేటలో 4, మార్కాపురం, ఉరవకొండ, ఆళ్లగడ్డ, పాడేరుల్లో 3, నెల్లూరు, సీతారాంపురం, గూడూరు, కందుకూరుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది. కాగా, ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి.