సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో డీఎండీకే తలపెట్టిన మానవహారం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆ పార్టీ కార్యకర్తల్ని
సాక్షి, చెన్నై : సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో డీఎండీకే తలపెట్టిన మానవహారం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆ పార్టీ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపించారు. ఆ పార్టీ అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, యువజన నేత సుధీష్‌తో పాటుగా నాయకుల్ని అరెస్టు చేశారు. టాస్మాక్‌లకు వ్యతిరేకంగా గురువారం కూడా నిరసనలు సాగాయి. కాగా, గాంధేయ వాది శశి పెరుమాళ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబీకులు అంగీకరించారు.
శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి. టాస్మాక్‌లకు వ్యతిరేకంగా గాంధేయవాది శశిపెరుమాళ్ ఆత్మతర్పణంతో రాష్ట్రంలో ఉద్యమం రాజుకున్న విషయం తెలిసిందే. సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. విద్యార్థులు, మహిళలు, వికలాంగులు, కొన్ని పార్టీలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీస్తూ వస్తున్నాయి. టాస్మాక్‌లపై దాడులు పెరిగాయి. సేలంలో జరిగిన దాడితో టాస్మాక్ సిబ్బంది సెల్వం బలి కావడంతో ఆందోళనలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుంది. గురువారం చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
నాగుర్ కోవిల్‌లో టాస్మాక్ దుకాణంపై దాడికి యత్నించి విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించి చెదరగొట్టారు. పచ్చయప్ప కళాశాల విద్యార్థులు తమ కళాశాల ఆవరణలో దీక్ష చేపట్టడంతో దాన్ని భగ్నం చేయడానికి యత్నించి విఫలం అయ్యారు. అంబత్తూరులోని టాస్మాక్ గోడౌన్‌కు తాళం వేయడానికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేశారు. నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో పలు చోట్ల నిరసనలు సాగగా, వారందర్నీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఇలా పలు చోట్ల నిరసనలకు యత్నించిన వాళ్లందర్నీ అరెస్టు చేయడం, తిరగబడ్డ పక్షంలో లాఠీలు ఝుళిపించే పనిలో పడ్డారు. ఇక, ప్రధాన ప్రతి పక్షం డీఎండీకే తలబెట్టిన మానవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. చేపాక్కంలో వికలాంగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సందర్శించి మద్దతు తెలియజేశారు.
మానవహారం భగ్నం : టాస్మాక్‌లకు వ్యతిరేకంగా డీఎండీకే నేత విజయకాంత్ మానవహారానికి పిలుపునిచ్చారు. చెన్నై కోయంబేడు నుంచి సచివాలయం వరకు ఈ మానవ హారం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరారు. తొలుత అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా కోర్టును విజయకాంత్ ఆశ్రయించారు. కోర్టు విచారణను ఈనెల పదో తేదికి వాయిదా వేయడంతో ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు మానవహారానకి ఆయన సిద్ధం అయ్యారు. సాయంత్రం కోయంబేడు నుంచి - సచివాలయం మీదుగా ఆ పార్టీ వర్గాలు అక్కడక్కడ గుమిగూడాయి. మరి కాసేపట్లో మానవహారం ఆరంభం కానున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి భగ్నం చేశారు.
విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, యువజన నేత సుధీష్‌లతో పాటుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల్ని బలవంతంగా అరెస్టు చేసి , బస్సులో ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన ఆ పార్టీ వర్గాలు బస్సును అడ్డుకోవ డంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. దీంతో ఆ పార్టీ వర్గాలపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కన్పించిన వాళ్లందర్నీ చితక్కొట్టి, చెదరగొట్టాడు. దీంతో ఆ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపులోకి వచ్చినానంతరం విజయకాంత్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అలాగే, పలు మార్గాల్లో గుమిగూడిన ఆ పార్టీ వర్గాలను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. కాగా, తమ మానవహారం భగ్నం చేయడానికి లాఠీలు ఝుళిపించారని, ఆందోళన కారుల్ని అణగదొక్కేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రేమలత విజయకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విజయకాంత్ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల ఆ పార్టీ వర్గాలు ఆందోళన లకు దిగాయి.
కాగా, దీక్ష భగ్నం చేస్తూ పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో విజయకాంత్ నేరుగా బస్సులోకి ఎక్కేస్తూ ప్రదర్శించిన హావా బావాలు వ్యంగాస్త్రాలకు అపహస్యానికి గురికాక తప్పలేదు. నేడు అంత్యక్రియలు : గాంధేయ వాది శశిపెరుమాళ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబీకులు అంగీకరించారు. గాంధేయ వాది శశిపెరుమాళ్ కుటుంబం మృతదేహాన్ని తీసుకోకుండా దీక్ష చేపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉదయం ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్‌లు శశిపెరుమాళ్ కుటుంబాన్ని పరామర్శించారు. వారిని బుజ్జగించి మృత దేహాన్ని తీసుకునేందుకు అంగీకరింప చేశారు. అయితే, తాము చేపట్టిన దీక్ష మాత్రం అంత్యక్రియల అనంతరం విరమిస్తామని ఆయన కుటుంబీకులు స్పష్టం చేశారు. దీంతో శుక్రవారం శశిపెరుమాళ్ మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో సేలంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు.
మూడు వేల దుకాణాల మూత: రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదం ఊపందుకుని ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్మథనంలో పడింది. టాస్మాక్ మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి ప్రజల్ని బుజ్జగించే కార్యాచరణలో పడ్డట్టు సమాచారం. రాష్ట్రంలో స్కూళ్లు, ఆలయాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మూడు వేల మద్యం దుకాణాలు ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు అందుకు తగ్గ నివేదికను సీఎం జయలలితకు పంపినట్టు తెలిసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సీఎం జె జయలలిత ఏ క్షణానైనా ప్రకటన వెలువరించ వచ్చన్న సంకేతాలు ఉన్నాయి. మద్య నిషేధం దశల వారీగా అమలు చేయడంలో భాగంగా ఈ దుకాణాలను మూసి వేస్తూ, ప్రజల్లో బయలు దేరిన ఆక్రోశాన్ని చల్లార్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.