ఏపీ భవన్ మరో జంతర్‌మంతర్
Published Wed, Oct 9 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు రోజులుగా చేస్తున్న దీక్షతో ఏపీభవన్ పరిసరాలు మరో జంతర్‌మంతర్‌గా మారిపోయాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, ఏపీభవన్‌లో దీక్ష చెయ్యొద్దంటూ ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ నోటీసులు పంపించినప్పటికీ టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. ఇక రెండో రోజు కూడా జనం లేక దీక్ష స్థలం వెలవెల పోయింది. యథావిధిగా దీక్ష ప్రారంభించిన బాబుకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన టీడీపీ నాయకగణం మినహా ఇతరుల మద్దతు లభించడం లేదు.
నగరంలో దాదాపు పది లక్షల మంది వరకు తెలుగువారున్నారు. అందులోనూ సీమాంధ్రులే ఎక్కువగా ఉన్నా ఢిల్లీలోని తెలుగువారు ఏపీభవన్‌వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తమ సొంత సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వచ్చిన ఎల్‌ఐసీ ఉద్యోగులు ఏపీభవన్ ఆవరణలో తిరగడంతో మంగళవారం ఉదయం కాస్త జనం ఉన్నట్టు కనిపించినా మధ్యాహ్నానికి ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఉన్న కొద్దిమందికి సైతం టీడీపీ నాయకులు సకల మర్యాదలు చేశారు. గాలితుంపరలు వచ్చే విధంగా ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటుచేసి కూర్చున్న కొద్దిమందినీ అక్కడి నుంచి లేవకుండా చూసుకున్నారు.
జెండాలు పట్టుకునేవారు లేక...
రెండో రోజు ధర్నాకు స్థానిక తెలుగువారు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తారేమోననే ఆశతో టీడీపీ నాయకులు పార్టీ జెండాలను పెద్ద సంఖ్యలో తెప్పించారు. అయితే పరిస్థితి మొదటి రోజుకంటే ఇంకా పలుచగా ఉండడంతో చివరికి వాటిని వాడనేలేదు. దీంతో అక్కడున్న చిన్నారులు వాటితో ఆడుకున్నారు. జెండాలు పట్టుకుని ఏపీభవన్ ఆవరణలో పరుగెత్తుతూ సరదా తీర్చుకున్నారు.
అంతటా రు‘బాబే’...
చంద్రబాబు దీక్షకు కూర్చున్నప్పటి నుంచి ఏపీభవన్‌లో ఆ పార్టీ నాయకులు అన్ని విషయాల్లోనూ మా యిష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారని కొందరు సిబ్బంది వాపోతున్నారు. భద్రతా కారణాల రీత్యా మామూలు సమయాల్లో సామాన్యులకు మెయిన్‌గేట్ నుంచి అనుమతి ఉండదు. నిత్యం అక్కడ విధులు నిర్వర్తించే మీడియా ప్రతినిధులను సైతం ఒక్కోసారి గుర్తింపు కార్డులను చూపితేనే లోనికి అనుమతిస్తారు. కానీ రెండు రోజులుగా ఈ విధానానికి భద్రతా సిబ్బంది సైతం స్వస్తి చెప్పక తప్పనిస్థితి. ఎవరెవరు లోపలికి వస్తున్నారో సైతం తెలియని పరిస్థితి.
క్యాంటీన్ కిటకిట..నిబంధనలు పట్టవట
ఏపీ భవన్‌లోని వీఐపీ క్యాంటీన్‌లోకి సామాన్యులకు అనుమతి ఉండదు. సాధారణ వ్యక్తులకు కింద ఉన్న క్యాంటీన్‌లోకి మాత్రమే అనుమతిస్తారు. కానీ మంగళవారం ఇందుకు భిన్నంగా అందరినీ అనుమతించారు. చంద్రబాబు దీక్షతో వీఐపీ క్యాంటీన్ తలుపు బార్లా తెరిచేశారు. దీంతో ఏపీభవన్‌లోని గదుల్లో ఉంటున్నవారికి సైతం భోజనం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఏపీభవ న్ భద్రత, దీక్షకు అనుమతి ,క్యాంటీన్ ఇలా ప్రతి చోటా టీడీపీ నాయకులు తమ రు‘బాబు’ చూపుతూనే ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement