'కేటగిరీల వారీ కటాఫ్ మార్కులు ఉండాలి'
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, దివ్యాంగుల ప్రాధమిక హక్కులను కాలరాస్తుందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో అన్ని తరగతుల వారికి జనరల్ కటాఫ్ మార్కులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, దివ్యాంగుల వారికి న్యాయం చేసేందుకు కృషి చేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు.
గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కేటగిరీల వారిగా కటాఫ్ మార్కులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అందరికీ ఒకే కటాఫ్ కాకుండా ఆయా తరగతుల వారీ కటాఫ్ మార్కుల విధానాన్ని పాటించాలన్నారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా తరగతుల వారీ కటాఫ్ ఉండాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల‍్కొనాలని.. లేకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో ప్రజా ఉద్యమానికి సిద్దమని ఆయన హెచ్చరించారు.