
క్యూఆర్టీ బలగాలను నియమించండి
లోకల్ రైళ్లలో పెరుగుతున్న నేరాలు, రైల్వే స్టేషన్లకు ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్టీ) బలగాలను ఏర్పాటు చేయాలని కోరుతూ
రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని కోరిన రైల్వే శాఖ
హోం శాఖకు చేరిన ప్రతిపాదన
‘ఉగ్ర’ హెచ్చరికల నేపథ్యలో అప్రమత్తం
సాక్షి, ముంబై : లోకల్ రైళ్లలో పెరుగుతున్న నేరాలు, రైల్వే స్టేషన్లకు ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్టీ) బలగాలను ఏర్పాటు చేయాలని కోరుతూ హోం శాఖకు రైల్వే కమిషనర్ కార్యాలయం నివేదిక పంపింది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే లోకల్ రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)తోపాటు క్యూఆర్టీ బలగాలు కూడా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నాయి. 2008 నవంబరు 26న (26/11) ఉగ్రవాదుల మారణహోమం అనంతరం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భద్రత కట్టుదిట్టం చేసుకున్నాయి.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లోకల్ రైల్వే స్టేషన్లలో అదనంగా పోలీసులను మోహరించారు. కాని చాలా స్టేషన్లలో డోర్ మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానర్లు పనిచేయడం లేదు. ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. తాజాగా 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్‌కు ఉరి శిక్ష విధించడంతో ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా దాడులు జరిపే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ఉగ్రదాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు రైల్వే స్టేషన్లలో క్యూఆర్టీ బలగాలను ఏర్పాటు చేయాలని హోం శాఖకు రైల్వే కమిషనర్ కార్యాలయం నివేదిక పంపింది.
మహిళ బోగీలు ఒకేచోట..?
ఇటీవల లోకల్ రైలులో బిహార్‌కు చెందిన యువకుడు ఓ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో మహిళ ప్రయాణికుల భద్రత అంశం మరోమారు తెరమీదకొచ్చింది. సీసీ టీవీ ఫుటేజ్‌ల సాయంతో నాలుగు రోజుల తరువాత ఆగంతకుడిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో లోకల్ రైళ్లలో మొదటి తరగతి, రెండో తరగతి మహిళా బోగీలన్ని ఒకదాని తరువాత ఒకటి ఉంటే భద్రత కల్పించేందుకు మరింత వీలు పడుతుందని రైల్వే పోలీసు కమిషనర్ మధుకర్ పాండే అభిప్రాయపడ్డారు.
‘ప్రస్తుతం లోకల్ రైళ్లలో రెండు సాధారణ బోగీలు, తరువాత రెండో తరగతి మహిళా బోగీ ఉంటుంది. మొత్తం రైలు ఇలానే ఉంటుంది. దీంతో అన్ని బోగీల్లో పోలీసులను ఏర్పాటు చేయాలంటే కష్టం. దీంతో వీటన్నింటిని వరుసగా ఒకే చోట ఉంచితే పోలీసులను మోహరించేందుకు సులభతరమవుతుంది. అలాగే తాము సురక్షితంగా ఉన్నామనే భావన మహిళల్లో కల్గుతుంది’ అని పాండే అభిప్రాయపడ్డారు.