సవరణకు ఆమోదం
నిర్భంద విద్యా హక్కు చట్టం బిల్లులో
మాతృభాషలో విద్యనభ్యసించే వెసులుబాటు
పదో తరగతి వరకు కన్నడం తప్పనిసరి
బెంగళూరు : నిర్భంద విద్యా హక్కు చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన ‘ఉచిత, నిర్భంద విద్యా హక్కు (సవరణ)-2015’ బిల్లుకు విధానసభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు తమ మాతృభాషలో లేదా కన్నడ భాషలో విద్యనభ్యసించేందుకు ఈ బిల్లు వెసులుబాటు కల్పించనుంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కన్నడ భాషను తప్పనిసరిగా ఒక భాషగా నేర్చుకునేందుకు గాను రూపొందించిన ‘కన్నడ భాషా శిక్షణ బిల్లు-2015’కు సైతం విధానసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ ఈ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టి, బిల్లులోని ముఖ్యాంశాలను సభకు వివరించారు. ఈ బిల్లులపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఈ రెండు బిల్లులకు విధానసభ ఆమోదం తెలిపింది. కాగా, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన చట్టసభల సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా మంత్రులు చెప్పిన సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి...
యశస్విని పథకానికి సంబంధించి లబ్దిదారులు చెల్లించాల్సిన వార్షిక కంతును తగ్గించే దిశగా పరిశీలన జరుపుతున్నట్లు రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ విధానపరిషత్‌కు తెలియజేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో పరిషత్ సభ్యుడు మహంతేష్ కవటగి అడిగిన ప్రశ్నకు మహదేవ ప్రసాద్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం సాధారణ వర్గానికి చెందిన లబ్దిదారులు రూ.710, ఎస్సీ-ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ.510ని వార్షిక కంతుగా చెల్లిస్తున్నారని ఈ మొత్తాన్ని మరింత తగ్గించే దిశగా ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.
మార్కెట్‌లో టొమాటో ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఆదుకునేందుకు గాను కనీస మద్దతు ధర చెల్లించి టొమాటోను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ విధానపరిషత్‌లో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పరిషత్ సభ్యుడు రామచంద్ర గౌడ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేసవి డిమాండ్ దృష్ట్యా కర్బుజాలను రసాయన ఇంజక్షన్‌లు ఇస్తున్నారన్న ఆరోపణలు రుజువు కాలేదని రాష్ట్ర మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో కోటా శ్రీనివాస పూజారి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు బదులుగా కృష్ణబైరేగౌడ సమాధానమిచ్చారు. తర్బూజాలకు రంగు కల్పించేందుకు గాను రసాయన ఇంజక్షన్‌లు ఇస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కొన్ని దుకాణాల నుంచి తర్బూజా శాంపిల్లను సేకరించి పూణెలోని ప్రయోగాలయానికి పంపామని చెప్పారు. పరీక్షల అనంతరం కర్బూజాల్లోకి రసాయనాన్ని ఇంజక్ట్ చేసినా అది కేవలం మూడు సెంటీమీటర్ల వరకే వెళుతుంది కాబట్టి ఆరోగ్యంపై దుష్ర్పభావాలు ఉండబోవని తేలిందని చెప్పారు.
2014-15 ఆర్థిక ఏడాదిలో రుణాల రీఫండ్ అధికంగా ఉన్న కారణంగా ప్రస్తుతం రైతులకు రుణాలను మాఫీ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ విధానపరిషత్‌లో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో పరిషత్ సభ్యుడు శివానంద కౌజలగి అడిగిన ప్రశ్నకు మహదేవ ప్రసాద్ సమాధానమిచ్చారు.
బీఎంటీసీలో జరిగే అక్రమాల నిరోధంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే దిశగా బీఎంటీసీలో ఈ-టికెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పరిషత్‌లో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పరిషత్ సభ్యుడు కోటా శ్రీనివాస్ పూజారి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ డిసెంబర్ ఆఖరులోగా బీఎంటీసీలో ఈ-టికెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.