విద్యా చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
చట్టమొచ్చి ఆరేళ్లు కావొస్తున్నా పట్టించుకోరా?
ప్రైైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశం కనిపిస్తోందని వ్యాఖ్య
పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సర్కారుకు ఆదేశం
హైదరాబాద్: నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధన రాష్ట్రంలో అమలుకాకపోతుండటంపై తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. విద్యా హక్కు చట్టం వచ్చి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరును చూస్తుంటే ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో బలహీనవర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లను అమలుచేసేందుకు ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నారు.. ఇకపై ఏం చేయనున్నారు... తదితర వివరాలను ఓ అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకున్న తీవ్రత దృష్ట్యా ఇందులో వాదనలు వినిపించాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
బలహీనవర్గాల విద్యార్థులకు చట్ట ప్రకా రం 25శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేటు విద్యా సంస్థలను ఆదేశించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్ (కోవా), మరో రెండు సంస్థలు దాఖలుచేసిన వ్యాజ్యం (పిల్)పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘2009లో నిర్బంధ విద్యాహక్కు చట్టం వచ్చింది. మనం ఇప్పుడు 2015లో ఉన్నాం. చట్టం వచ్చి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ అమలుకావడం లేదంటే అది నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ తీరు ఏ మాత్రం హర్షణీయం కాదు. ప్రభుత్వ తీరు చూస్తోంటే ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్నట్లుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది వాణిరెడ్డి స్పందిస్తూ, విద్యా హక్కు చట్టం అమలుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని, చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘అసలు కమిటీ ఎందుకు? చట్టం అమలుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఎక్కడుంది? అయినా కమిటీ ఏం చేస్తుంది? అసలు బలహీనవర్గాలకు 25 శాతం రిజర్వేషన్లు ఉన్నాయన్న సంగతైనా మీకు తెలుసా’ అని ప్రశ్నించింది. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, ఆరేళ్లలో చేయని వాళ్లు ఏడాదిలో చేస్తారని ప్రశ్నించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.