ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హయాంలో వాణిజ్య సముదాయాలపై అధికారుల దాడులు తగ్గిపోయాయని ప్రకటించడంద్వారా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హయాంలో వాణిజ్య సముదాయాలపై అధికారుల దాడులు తగ్గిపోయాయని ప్రకటించడంద్వారా వ్యాపారవర్గాలను అరవింద్ కేజ్రీవాల్ తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆరోపించారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద సేకరించిన వివరాలను సోమవారం ఆయన మీడియా ముందుంచారు. 2014, జనవరి ఐదో తేదీనుంచి ఫిబ్రవరి 14వ తేదీవరకూ ఆప్ అధికారంలో ఉందని, అప్పట్లో మొత్తం 151 పర్యాయాలు వాణిజ్య సముదాయాలపై దాడులు జరిగాయన్నారు. ఇందులో జనవరి ఐదో తేదీనుంచి 31వ తేదీవరకూ 51 జరిగాయని, తమ పార్టీ అధికారంలో ఎక్కువకాలం కొనసాగబోదని అర ్దమయ్యాక మరో 100 సార్లు దాడులు జరిగాయన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ రాబడి కూడా గణనీయంగా పెరిగిందన్నారు.
కొట్టిపారేసిన ఆప్
వ్యాపారవర్గాలను తాము తప్పుదారి పట్టిస్తున్నామంటూ బీజేపీ చేసిన విమర్శలను ఆప్ కొట్టిపారేసింది. నిరాశకు లోనైనందువల్లనే ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తోందంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఢిల్లీవాసులను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ యత్నిస్తోంది. చిన్న చిన్న వ్యాపారులపై మా హయాంలో ఎటువంటి దాడులూ జరగలేదు. పెట్రోల్ బంకుల్లో నమూనాల సేకరణ కోసం జరిపిన తనిఖీలను కూడా దాడులుగా పేర్కొంటోంది. తాము అధికార పీఠం నుంచి తప్పుకున్నాక ప్రతి నెలా 250 నుంచి 300 వరకూ దాడులు జరుగుతున్నాయి.’ అని సదరు ప్రకటనలో పేర్కొంది.