
ముఖ్యమంత్రి నివాసంలో 30 ఏసీలు
న్యూఢిల్లీ: కరెంటు బిల్లుల్లో క్యాటగిరీలు ఉన్నట్లే చెల్లించే బిల్లుల ఆధారంగా వ్యక్తులనూ క్యాటగరైజ్ చేయాలనే వాదన ప్రస్తుతం ఢిల్లీలో వినిపిస్తోంది. ఎందుకంటే తనను తాను సమాన్యుడిగా అభివర్ణించుకునే ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి జూన్ నెల బిల్లు రూ. 1.35 లక్షలు.
నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్, సివిల్ లేన్ లోని ఆయన ఇల్లు.. అదే ప్రాంగణంలోని చిన్నపాటి కార్యాలయం.. రెండింటికి కలిపి మొత్తం 30 ఎయిర్ కండిషనర్లు అందుబాటులో ఉన్నాయి. ఆయన నివాసంలో రెండు మీటర్లు ఉన్నాయి. కార్యాలయానికి సంబంధించిన మీటరు కూడా డొమెస్టిక్ కోటాలోనే రిజిస్టర్ అయి ఉంది. అయితే దానిని కమర్షియల్ మీటర్గా పరిగణిస్తామంటూ సీఎం నివాసానికి కరెంటు సరఫరా చేసే టాటా పవర్ కంపెనీ ఇటీవలే నోటీసులు ఇచ్చింది.
ఇప్పటికే కేజ్రీవాల్ను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోన్న బీజేపీ.. కరెంటు బిల్లు విషయంలోనూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 'ఓ వైపు విద్యుత్ ఆదాచేయాలని ప్రజలకు నీతులు బోధిస్తూ ఇంట్లో మాత్రం లక్షల రూపాయల కరెంటు వాడేసుకుంటున్నారు' అంటూ విరుచుకుపడింది.