బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజల సంక్షేమమే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముద్రతో రూపొందిన ఈ మేనిఫెస్టో మధ్యతరగతి ప్రజల ఆలోచనలను ప్రతిబింబించింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ, ఆ పార్టీ సీనియర్ నేతలు నిర్మలా సీతారామన్, అనంత్‌కుమార్, హర్షవర్ధన్, సతీష్ ఉపాధ్యాయలతో కలిసి మంగళవారం డాక్యుమెంట్ విడుదల చేశారు. 35 అంశాలు, 270 పాయింట్లు ఉన్న ఈ మేనిఫెస్టోలో అభివృద్ధికి, మహిళల భద్రతకు, పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యతనిచ్చారు.
ఢిల్లీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న హామీని ప్రధానంగా చెప్పారు. అయితే ఆప్ ప్రచార అస్త్రమైన ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా అనే అంశాన్ని ఈ డాక్యుమెంట్ స్పృశించలేదు. 2013లో ఎన్నికల్లో విద్యుత్తు ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఇచ్చిన హామీని కూడా పక్కనబెట్టింది. ‘విజన్ డాక్యుమెంట్ మహిళా భద్రత, విద్యుత్తు, నీరు, పారిశుధ్యం, వాణిజ్యం, వ్యాపారం, విద్య, గృహవసతి, రవాణా, ఉపాధి, పర్యావరణ వ్యవహారాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది’ అని కిరణ్ బేడీ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విభాగంలో పనితీరును పారదర్శకంగా చేస్తామని హామీ ఇచ్చారు. నిధులను జాగ్రత్తగా ఖర్చు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది, అధికారులు ప్రజల్లో తిరుగుతూ తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు.
‘మన్‌కీ బాత్’ తరహాలో ‘దిల్ కీ బాత్’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియోలో నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం తరహాలో ప్రతి నెల ‘దిల్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తామని బేడీ తెలిపారు. ఇందులో తనతో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని వివరించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రజలతో మాట్లాడే సదుపాయం కూడా అందిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని, తమ ప్రభుత్వం కేంద్రంతో కలిసి సమన్వయంతో ముందుకుపోతుందని వివరించారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతమైన పథకాలను ఢిల్లీలో అమలుచేస్తామని వెల్లడించారు. ప్రతి కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షిస్తామని చెప్పుకొచ్చారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
పతి ఇంటికీ నీరు, మధ్యతరగతి ప్రజలకు లక్ష ఇళ్లు నిర్మాణం
ఢిల్లీవాసులకు నిర్బంధ ఆరోగ్య బీమా
స్మార్ట్ సిటీ, స్కిల్ హబ్‌ల ఏర్పాటు
పేదలకు, బీపీఎల్ కుటుంబాలకు సబ్సీడీ రేట్లతో విద్యుత్తు
మహిళా భద్రత
పర్యాటన, మెడికల్ టూరిజం కేంద్రంగా ఢిల్లీ
వ్యాపారం కోసం ఢిల్లీలో అనువైన వాతావరణం సృష్టించడం
{పభుత్వ భవనాలు పూర్తిగా వినియోగించడం,
స్కూళ్లు, కాలేజీలలో సెకండ్ హాఫ్‌లో ఇతర క్లాసులు నిర్వహించడం
దక్షిణ ఢిల్లీలోని వివాదాస్పద బస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్టు కారిడార్ రద్దు
పతి 5 కి.మీలకు ఒక 15 పడకల ఆస్పత్రి, అంబులెన్సు
ఈశాన్య వాసుల భద్రతకు అన్నీ పోలీసు స్టేషన్లలో ప్రత్యేక సెల్, 24 గంటల హెల్ప్‌లైన్
అనధికార కాలనీల క్రమబద్ధీకరణ
సంక్షేమమే ఎజెండా..
Published Tue, Feb 3 2015 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement