మారిన రూపు రేఖలు..
మారిన రూపు రేఖలు..
Published Wed, Oct 5 2016 11:34 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
ఆసిఫాబాద్ జిల్లాకు కొమురంభీం పేరు
కొమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 18 చొప్పున మండలాలు
మంచిర్యాలలో 15..
కొత్తవి 17.., మొత్తం 69కి చేరిన మండలాల సంఖ్య
అధికార యంత్రాంగం తాజా ప్రతిపాదనలు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాల విభజన ప్రక్రియలో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. అనూహ్యంగా ఆసిఫాబాద్ జిల్లా తెరపైకి రావడంతో ముందుగా మూడు జిల్లాల కోసం రూపొందించిన ప్రతిపాదనల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జిల్లా టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా అధికార యంత్రాంగం కొత్త ప్రతిపాదనలు తయారు చేసింది. కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా కాగజ్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని నిర్ణయించారు. కొత్త మండలాల సంఖ్యను 17కు పెంచాలని తాజాగా ప్రతిపాధించారు. దీంతో మండలాల సంఖ్య 69కి చేరుకుంది. జిల్లా అధికార యంత్రాంగం రూపొందించిన తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తే..
ఆసిఫాబాద్(కొమురంభీం) పరిధిలో 18 మండలాలు..
కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో 18 మండలాలను చేర్చారు. సిర్పూర్(టి) నియోజవకర్గ పరిధిలోని ఐదు మండలాలు, కొత్తగా ఏర్పడనున్న పెంచికల్‌పేట, చింతలమానేపల్లి మొత్తం ఏడు మండలాలతో కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రతిపాదించారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చిన జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్(కొత్త) మండలాలను ఆసిఫాబాద్ పరిధిలోకి చేర్చారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని మూడు.. తాండూర్, భీమిని, కన్నేపల్లి(భీమినిలో కొత్త) మండలాలను ఆసిఫాబాద్ జిల్లాలో చేర్చుతున్నారు. సుమారు 4,763 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఆసిఫాబాద్ జిల్లాలో 5.92 లక్షల మంది జనాభా ఉంటుంది. భీం నడయాడిన కెరమెరి మండలం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉండడంతో ఆదివాసీ పోరాట యోధుని పేరు ఆసిఫాబాద్‌కు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు.
నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి...
ఆదిలాబాద్ జిల్లాలో కూడా 18 మండలాలు ఉండనున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని నార్నూర్, గాదిగూడ(నార్నూర్‌లో కొత్తది) మండలాలను ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉంచాలని నిర్ణయించారు. కొత్తగా భీంపూర్(తాంసిలో కొత్తది), సిరికొండ(ఇచ్చోడలో కొత్తది) మండలాలుగా చేయాలని నిర్ణయించారు. తాజా ప్రతిపాదనల మేరకు ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణం 4,153 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. జనాభా 7.21 లక్షలు ఉంటుందని ప్రతిపాదించారు.
కొమురంభీంలో భీమారం కొత్త మండలం..
మొత్తం 15 మండలాలతో కలిపి మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేయాలని తాజా ప్రతిపాదనలు తయారు చేశారు. కొత్తగా భీమారం(జైపూర్‌లో కొత్తది) మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జన్నారం మండలాన్ని మంచిర్యాలలోనే కొనసాగించాలని నిర్ణయించారు. సుమారు 7.07 లక్షల జనాభా కలిగిన కొమురంభీం జిల్లా 3,350 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉండనుంది. కొత్తగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు కానుండడంతో కొమురంభీం పేరును ఆసిఫాబాద్‌కు పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
నిర్మల్‌లో మరికొన్ని కొత్త మండలాలు..
నిర్మల్ జిల్లాలో మరికొన్ని కొత్త మండలాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం నిర్మల్ మండలాన్ని మూడు మండలాలుగా.. సోన్, నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దిలావర్‌పూర్ మండలంలో నర్సాపూర్-జి(కొత్త), కడెం మండలం దస్తూరాబాద్(కొత్త)ను మండలం చేయాలని ప్రతిపాదించారు. బాసర కూడా మండలంగా ఏర్పడనుంది. మొత్తం 7.30 లక్షల జనాభా కలిగిన నిర్మల్ జిల్లా 3,844 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండనుంది.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్(అర్బన్), ఆదిలాబాద్(రూరల్), మావల, భీంపూర్, సిరికొండ, గాదిగూడ ; మంచిర్యాల : భీమారం, నస్పూర్, హాజీపూర్ ; ఆసిఫాబాద్ : లింగాపూర్, పెంచికల్‌పేట్, చింతల్‌మానపల్లి ; నిర్మల్ : నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్, సోన్, నర్సాపూర్-జి, దస్తూరాబాద్, బాసర. (నిర్మల్ మూడు మండలాలుగా విడిపోతోంది)
Advertisement