నగర శివార్లలోని ఏటీఎంలకు రక్షణ కరువైంది. తాజాగా శివార్లలోని తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన...
- సెక్యూరిటీ గార్డుపై వేట కొడవలితో దాడి
- ముసుగులు వేసుకుని చెలరేగిపోయిన దుండగులు
- సీసీ కెమెరాలు ధ్వంసం
- నగర శివార్లలో కలకలం
బెంగళూరు, న్యూస్‌లైన్ : నగర శివార్లలోని ఏటీఎంలకు రక్షణ కరువైంది. తాజాగా శివార్లలోని తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి న గదు లూటీకి విఫలయత్నం చేసిన సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు... తావరకెరె సమీపంలోని తిగరళపాళ్య మెయిన్ రోడ్డులో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం కేంద్రం ఉంది. చెన్నైకి చెందిన బసవరాజ్ ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బసరాజ్ శుక్రవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు.
శనివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో బైక్‌లో వచ్చిన ఇద్దరు దుండగలు ముసుగులు ధరించి ఏటీఎంలోకి ప్రవేశించారు. ఇదే సమయంలో బసవరాజ్ వారిని అడ్డగించాడు. దుండగులు బసవరాజ్‌పై కారం చల్లి, వేటకొడవలితో దాడికి దిగారు. కాళ్లు, చేతులు బంధించారు. అనంతరం దుండగులు ఏటీఎం బాక్స్‌ను పగలగొట్టడానికి తీవ్రంగా యత్నించారు.
అదే సమయంలో ట్రాఫిక్ కూడా పెరగడంతో దుండగులు భయంతో పరారయ్యారు. గంట తరువాత బసవరాజ్ కట్లు విప్పుకుని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు బసవరాజ్‌ను ఆస్పత్రికి తరలించారు. దుండగులు ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.