అన్ని కేసులకు సంబంధించి మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డికి సుప్రీం కోర్టులో బెయిల్ లభించిన నేపథ్యంలో
బెంగళూరు : అన్ని కేసులకు సంబంధించి మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డికి సుప్రీం కోర్టులో బెయిల్ లభించిన నేపథ్యంలో బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం వద్ద భద్రతను రెట్టింపు చేశారు. ఆయన విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనకు బెయిల్ లభిం చిన వెంటనే బళ్లారితో పాటు బెంగళూరులో ఉన్న జనార్ధనరెడ్డి అభిమాను లు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఆయన విడుదలకు సంబంధించిన కాగితాలు తొలుత హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు పరిచిన అనంతరం బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తీసుకురావాల్సి ఉంటుంది.
ఇందుకు కనీసం నాలుగు రోజుల సమయం పట్టనున్నట్లు జనార్ధనరెడ్డి తరుఫు న్యాయవాది హనుమంతరాయ పేర్కొన్నారు. కాగా, జైలులో ఉన్న తమ అభిమాన నేత గాలి జనార్ధనరెడ్డిని కలవడానికి బుధవారం నుంచి బళ్లారితోపాటు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విడుదల రోజున ఎక్కువ మంది జనసందోహం చేరే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.