మహిళల రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు చేసినా నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదో ఒకచోట మహిళలు దాడులకు బలైపోతూనే ఉన్నారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి సేఫ్ సిటీ ప్రణాళికలో భాగంగా బెంగళూరు మహా నగర పాలికె సురక్ష బ్యాండ్‌లను అందించనుంది. జీపీఎస్ ఆధారిత ఈ బ్యాండ్లు మహిళలకు సబ్సిడీ ధరతో అందజేయనుంది.
సాక్షి,బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఘటనలు అరికట్టడానికి పాలికె సరికొత్త సాంకేతిక రక్షణాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే ఉద్దేశంతో రూపొందించిన సేఫ్‌సిటీ ప్రణాళికలో భాగంగా మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలపై బీబీఎంపీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. అందులో భాగంగా నగరవ్యాప్తంగా మహిళలు, యువతులకు జీపీఎస్ ఆధారిత సురక్ష బ్యాండ్‌లను అందించడానికి నిర్ణయించుకున్నట్లు కేంద్రానికి అందించిన నివేదికలో పేర్కొంది.
ఈ ప్రణాళిక అమలుకోసం పాలికె రూ.100 కోట్ల నిధులు కేటాయించాలంటూ నివేదికలో విన్నవించింది. మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలు, అనుసరించిన ప్రణాళికలపై చర్చించి తమకు నివేదికలు అందించాలంటూ కొద్ది నెలల క్రితం దేశంలోని ప్రముఖ నగరాల పాలనా సంస్థలకు కేంద్రప్రభుత్వం సూచనలు జారీ చేసింది. నివేదికలు అందించిన అనంతరం నిర్భయ నిధుల పథకం ద్వారా ఆయా నగరాల్లో మహిళల భద్రత కోసం నిధులు కేటాయిస్తామంటూ కేంద్రప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇటీవల సమావేశమైన నగర పోలీసులు, పాలికె అధికారులు సురక్ష బ్యాండ్‌లను అందించడానికి నిర్ణయించుకొని ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ప్రస్తావించారు.
ఎలా పనిచేస్తుంది...
పాలికె అందించనున్న సురక్ష బ్యాండ్‌లను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు.« మహిళలు, యువతులు ధరించనున్న సురక్ష బ్యాండ్‌లలో ఆయా మహిళల, యువతుల కుటుంబ సభ్యులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లు తదితర ఏడు ఫోన్ నంబర్లు నమోదు చేయనున్నారు. ఏదైనా ఆపద తలెత్తిన సమయంలో వెంటనే సురక్ష బ్యాండ్ ద్వారా యువతులు కుటుంబ సభ్యులతో పాటు బ్యాండ్‌లో పొందుపరచిన ఏడు నంబర్లకు ఒకేసారి ప్రస్తుతం తామున్న ప్రదేశం, ఆపద గురించి సమాచారం చేరవేయవచ్చు. జీపీఎస్ ద్వారా పోలీసులు, కుటుంబ సభ్యులు వెంటనే యువతులు ఉన్న చోటుకు చేరుకోవడానికి ఈ సురక్ష బ్యాండ్‌లు ఎంతో సహకరించనున్నాయి.
ధరల్లో సబ్సిడీ : మహిళల భధ్రత కోసం అందుబాటులోకి తేనున్న సురక్ష బ్యాండ్‌లను పాలికె సబ్సిడీ ధరల్లో మహిళలకు విక్రయించడాని కి నిర్ణయించుకుంది. ఒక్కో బ్యాండ్ తయారికీ రూ.800 ఖర్చు కానుండగా మహిళలకు రూ.400లకే విక్రయించడానికి పాలికె నిర్ణయించుకుంది. ప్రయోగాత్మకంగా పాలికె పరిధిలో పది లక్ష ల మంది మహిళలకు సురక్ష బ్యాండ్‌లు అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment