- కుమారకు జేడీఎస్‌ఎల్‌పీ హితవు
- తీరు మార్చుకోవాలని సభ్యుల విన్నపాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : జేడీఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి ఉన్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బెంగళూరులోని ఓ హోటల్‌లో బుధవారం ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. హెచ్‌డీ. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ మనసులోని అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు.
జేడీఎల్‌పీ నాయకుని హోదాలో కుమార స్వామి హుందాగా వ్యవహరించాలని పలువురు ఎమ్మెల్యేలు హితవు పలికారు. ‘మా నియోజక వర్గాల్లో పార్టీ కార్యకర్తలు మీ గురించి అడుగుతున్నారు, మీరేమో బెంగళూరు వదిలి వచ్చేట్లు లేరు’ అంటూ కుమారస్వామిని కొందరు ఎమ్మెల్యేలు నిష్టూరమాడినట్లు తెలిసింది. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర పర్యటన చేపట్టాలని సూచించారు. ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కుమారస్వామికి అత్యంత సన్నిహితుడైన బెంగళూరులోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ గైర్హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తనకు ఈ సమావేశం గురించి ఆహ్వానం అందలేదని, కనుక హాజరయ్యేది లేదని జమీర్ మంగళవారమే తేల్చి చెప్పారు. అయితే ముందే నిర్ణయమైన కార్యక్రమాల వల్ల హఠాత్తుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాలేక పోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు రాత పూర్వకంగా తెలియజేశారని మాజీ మంత్రి, కుమారస్వామి సోదరుడు రేవణ్ణ విలేకరులకు తెలిపారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా కుమారస్వామిని, లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా తనను నియమిస్తారని వెలువడుతున్న వార్తలు ఊహాజనితాలని కొట్టి పారేశారు. తాను లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని కోరుకోవడం లేదన్నారు.
కోర్ కమిటీ ఏర్పాటు
పార్టీకి దిశా నిర్దేశం చేయడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కోర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అతివృష్టి పీడిత ప్రాంతాల్లో పర్యటనకు నాలుగు బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటన అనంతరం ఈ బృందాలు సమర్పించే నివేదిక ఆధారంగా సహాయక చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.
తమ పార్టీ పనై పోయిందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేస్తూ, కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ అవిభాజ్య అవయవమని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇచ్చినందున, వచ్చే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు ఆశీర్వదించినా ఆశ్చర్యం లేదని అన్నారు. అతివృష్టి పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు దండిగా నిధులిస్తున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేస్తున్న ప్రకటన వట్టి బూటకమని విమర్శించారు. అరకొర నిధులు విదిలిస్తున్నారని ఆరోపించారు.