సిద్ధరామయ్య అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీసులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ మహిళలపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు ర్యాలీగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రేస్‌కోర్స్ రోడ్ సమీపంలో సిద్ధరామయ్యతో పాటు దినేశ్ గుండురావు, రిజ్వాన్ అర్షద్, కె. సురేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యవస్థను యడియూరప్ప సర్కారు దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. కర్ణాటకను పోలీస్ రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు.
బీదర్‌లోని షహీన్ పాఠశాలలో వేసిన నాటకంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయన్న కారణంతో తొమ్మిది నుంచి పన్నేండేళ్ల పిల్లలను ఐదు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయురాలు, ఓ విద్యార్థి తల్లిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశారు. కర్ణాటక పోలీసుల చర్యను ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు తీవ్రంగా ఖండించారు.
నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అదుపు చేస్తున్న పోలీసులు
యెడ్డీని క్షమించరు
ఇద్దరు మహిళలను దేశద్రోహం కేసు కింద బలవంతంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిద్ధరామయ్య అంతకుముందు పేర్కొన్నారు. కుమార్తె నుంచి తల్లిని వేరు చేసినందుకు రాష్ట్ర మహిళలు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను క్షమించరని వ్యాఖ్యానించారు. సీఎం యడియూరప్ప విచక్షణ కోల్పోయినట్టుగా కన్పిస్తున్నారని సిద్ధరామయ్య తన ట్విటర్‌లో విమర్శించారు. వందేళ్ల క్రితం చేసిన అరాచక ఐపీసీ చట్టాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు. (చదవండి: ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..?)
Comments
Please login to add a commentAdd a comment