లైవ్ లో బిగ్ బాస్ విజేత ఆత్మహత్యాయత్నం
బెంగళూరు: కన్నడ బిగ్ బాస్ 4 విజేత ప్రథమ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్ బుక్ ఫాలోవర్లకు లైవ్ వీడియో పెట్టి అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నెల 5న బసశ్వేర నగర్ లోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. తన స్నేహితుడు లోకేశ్ తో తలెత్తిన విభేధాల కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్టు అతడు వెల్లడించాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియో అప్‌లోడ్ చేసి ముంబైలోని అర్జున్ భరద్వాజ్ అనే యువకుడు హోటల్ 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న తర్వాతే రోజే అదేవిధంగా ప్రథమ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.
'లోకేశ్ పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. బిగ్ బాస్ షోలో గెలిచినా టీవీ చానల్ నుంచి ఇంకా నగదు అందలేదు. డబ్బులు అవసరమైన వారికి ఎప్పుడు దానం చేస్తారని చాలా మంది పదేపదే అడుగుతున్నారు. షో నిర్వాహకులు చెక్ మాత్రమే ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులో ఒక్క పైసా కూడా నేను తీసుకోవాలనుకోలేదు. లోకేశ్ నాకు చెడ్డపేరు తెస్తున్నాడు. నా గురించి లేనిపోనివి ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఇదే నా చివరి ఫేస్ బుక్ లైవ్ వీడియో. ఎవరినైనా నొప్పించివుంటే మన్నించాల'ని ప్రథమ్ పేర్కొన్నాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అనుమానిస్తున్నారు.