నగరంలో మేకలు, గొర్రెల అమ్మకాలు సోమవారం జోరుగా సాగాయి. రాష్ట్రంలో ఉగాది మరుసటి రోజు మాంసాహారాన్ని ఆరగించే ‘వర్ష తొడకు’ను ఆచరించడం ఆనవాయితీ.
- ‘వర్ష తొడకు’ ఎఫెక్ట్ ..
- చామరాజపేట ఈద్గా మైదానంలో జోరుగా మేకల విక్రయాలు
- బాంబే గొర్రెలకు భలే గిరాకీ
- భారీగా పెరిగిన ధరలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో మేకలు, గొర్రెల అమ్మకాలు సోమవారం జోరుగా సాగాయి. రాష్ట్రంలో ఉగాది మరుసటి రోజు మాంసాహారాన్ని ఆరగించే ‘వర్ష తొడకు’ను ఆచరించడం ఆనవాయితీ. దరిమిలా ఇక్కడి చామరాజపేటలోని ఈద్గా మైదానంతో పాటు వివిధ ప్రాంతాల్లో నాటు, హైబ్రిడ్ గొర్రెల కొనుగోలుదార్లతో సందడి ఏర్పడింది. పొడవైన చెవులు కలిగిన ‘జమునాపురితో పాటు లావుగా ఉండే బాంబే గొర్రెలకు గిరాకీ ఎక్కువగా కనిపించింది.
గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి గొర్రె ధర రూ. వెయ్యి నుంచి రూ.1,500 వరకు పెరిగింది. సాధారణంగా ఈ పండుగకు మేకలకే డిమాండ్ ఎక్కువ. గొర్రెల ధర రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. తూకంలో చూస్తే కేజీ రూ.400-రూ.450 మధ్య ఉంటోంది. ఆయుధ పూజ, బక్రీద్‌లతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగే వ్యాపారం తక్కువని, అయితే మామూలు రోజులు కన్నా అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని పలువురు వ్యాపారులు తెలిపారు.
కాగా వేసవిలో మేత కొరతతో పాటు పలు రోగాల వల్ల మేకల పెంపకందార్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీని వల్ల కూడా మేకల ధరలు బాగా పెరిగిపోయాయని వ్యాపారులు చెప్పారు. రూ.8 వేల నుంచి రూ.21 వేలకు ధర పలికే మేకలు కూడా ఉన్నాయని తెలిపారు. ఎక్కువ మాంసంతో పాటు రుచి కూడా బాగా ఉంటుందనే అంచనాతో బన్నూరు గొర్రెలకు సాధారణంగా డిమాండ్ ఎక్కువైనప్పటికీ, ఈ పండుగకు అధికంగా మేకలను కొనుగోలు చేస్తుంటారు.
మండ్య, చిత్రదుర్గ, హావేరి, రామనగర, బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్లాపురం, కోలారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల నుంచి కూడా రైతులు విక్రయంకోసం గొర్రెలు, మేకలను ఇక్కడికి తోలుకొస్తుంటారు. మరో వైపు మాంసం దుకాణాల వద్ద పెద్ద పెద్ద క్యూలు ఉండడంతో ఐదారు గురు కలసి ఒక మేకను కొనుగోలు చేసి మాంసం పంచుకునే పద్ధతి కూడా ఇటీవల అలవాటైంది.
దీని వల్ల తాము కోరుకున్న మాంసం లభించడంతో పాటు కొంత డబ్బు కూడా ఆదా అవుతుందని అలాంటి వారు చెబుతుంటారు. మరి కొందరు ఈ వర్ష తొడకు కోసం చీటీలు కూడా నిర్వహిస్తుంటారు. అలాంటి చీటీలకు ఇటీవలి కాలంలో డిమాండ్ ఎక్కువైందని వాటి నిర్వాహకులు తెలిపారు.