చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ పొత్తులపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కెప్టెన్‌కు గాలం వేసే పనిలో పడ్డాయి. అన్నాడీఎం, డీఎంకేలు తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఇక మూడో ప్రాంతీయ పార్టీ అరుున డీఎండీకేపై రెండు జాతీయ పార్టీలు దృష్టి సారించాయి. రాజ్యసభ ఎన్నికల్లో తనకు స్నేహ హస్తం ఇవ్వలేదనే కోపంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. డీఎంకే సైతం చివరి వరకు ఆశచూపి కాంగ్రెస్ మద్దతును పొందడం విజయకాంత్‌ను బాధించింది. ఈ కారణంగా డీఎంకేపై సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా మారుతున్న బీజేపీవైపు వెళితే ఎలా ఉంటుందో తేల్చుకోలేక పోతున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చెందిన మరో ప్రాంతీయ పార్టీకూడా బీజేపీ కూటమిలో చేరితే తన ప్రాధాన్యత ఉండదనే సంశయంలో ఉన్నారు. ఎండీఎంకే ఇప్పటికే బీజేపీకి పచ్చజెండా ఊపింది. పీఎంకే సైతం అదే బాటలో పయనించే అవకాశం ఉంది. తన నాయకత్వాన్ని మన్నించి, గౌరవించినవారికే తన పార్టీ మద్దతు పలుకుతుందని విజయకాంత్ ఇటీవలే ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర స్థాయిలో కొత్తకూటమికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందు ఉంది. ఈ కొత్తకూటమిల దృష్టిలో ప్రధానమైన అంశంగా డీఎండీకే ఉంది. మాజీ కాంగ్రెస్ నేత, గాంధేయ మక్కల్ ఇయక్కం అధినేత తమిళరువి కెప్టెన్‌కు నచ్చజెప్పే పనిలో పడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతును విజయకాంత్ కోరారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డీఎంకే వైపు మొగ్గుచూపింది. అప్పుడు కాదని నేడు కలుపుకుపోతామని కోరితే కెప్టెన్ అంగీకరిస్తాడా అని కాంగ్రెస్ సంశయిస్తుండగా, ఎవ్వరూ దిక్కులేకపోవడంతో తనతో బేరసారాలకు దిగిందని కెప్టెన్ కాంగ్రెస్ వైపు గుర్రుగా చూస్తున్నారు.
ప్రతి కీలకమైన అంశాన్ని నాన్చే అలవాటున్న కెప్టెన్ ఏర్కాడులో పోటీ చేయాలా వద్దా అని నెలరోజుల పాటు మీమాంసలో పడ్డారు. నేడు లోక్‌సభ వంతు వచ్చింది. ఏదేమైనా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎండీకే ఏదో ఒక పార్టీ పంచన చేరకతప్పదని తెలుస్తున్నా, దాదాపు అన్ని పార్టీలు కెప్టెన్ చుట్టూ తిరుగుతున్నా అయోమయం వీడకపోవడం డీఎండీకే వర్గాల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తాము అన్ని పార్టీల చుట్టూ తిరిగితే లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు తమ చుట్టూ తిరగడం శుభపరిణామమంటున్నారు.
మల్లగుల్లాలు
Published Wed, Dec 18 2013 3:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM
Advertisement
Advertisement