అయ్యో..కెప్టెన్
డీఎండీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్కాంత్ పరిస్థితి ప్రస్తుతం తారుమారు అయ్యింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఓ ఊపు ఊపిన ఆయన ఇప్పుడు కమలనాధుల దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారు. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని భార్య ప్రేమలతతో కలిసి ప్రచారం చేసిన విజయకాంత్కు...మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది.
ఇక ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా, మిత్ర పక్షాలతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ తన పట్ల చూపిన ప్రేమ,ఆప్యాయతలు విజయకాంత్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలంటూ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందో లేదా, రాజపక్సేకు వ్యతిరేకంగా రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనల్ని సైతం ఖాతరు చేయలేదు.
తన సతీమణి ప్రేమలత, బావమరిది సుధీష్‌తో కలసి ఢిల్లీకి పరుగులు తీసిన విజయకాంత్‌కు చివరకు మిగిలింది నిరాశే. ఢిల్లీలో ఉన్నా, ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తొలుత అనారోగ్య కారణాలతో ఆయన వెళ్లలేదన్న ప్రచారం జరిగినా, చివరకు తన బావమరిది సుధీష్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వక పోవడం, తనకు మొదటి వరుసలో కాకుండా మూడో వరుసలో సీటు కేటాయించడంతో విజయకాంత్ కినుకు వహించారు.
దర్శనం కోసం ఎదురు చూపు: ప్రమాణ స్వీకారం ముగిసినా, చెన్నైకు విజయకాంత్ తిరుగు పయనం కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి ఎన్నికల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు విజయకాంత్ తీవ్రంగానే ప్రయత్నించినట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు పట్టించుకోకపోవడంతో ఒంటరిగానే అపాయింట్‌మెంట్ ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బుధవారం రాత్రి వరకు తన ప్రయత్నం చేసినా, కమలనాథుల దర్శనం మాత్రం విజయకాంత్‌కు దక్కలేదు. దీంతో విసిగి వేసారిన విజయకాంత్, ప్రేమలత, సుధీష్ తీవ్ర అసహనంతో గురువారం ఉదయాన్నే చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. చివరి క్షణంలోనైనా తమకు మోడీ దర్శనం దక్కుతుందని భావించినా, మిగిలింది నిరాశే.
ఎన్నికలప్పుడు తమను వాడుకుని ఇప్పుడు కమలనాథులు చీదరించుకోవడాన్ని డీఎండీకే వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అయితే డీఎండీకేను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను విజయకాంత్ తిరస్కరించడంతోనే ఆయన్ను దూరంగా పెట్టాలని కమలనాథులు నిర్ణయించినట్టు సమాచారం.
అందుకే ఢిల్లీలో పడిగాపులు కాసినా, మోడీ, రాజ్‌నాథ్‌ల దర్శనం విజయకాంత్‌కు దక్కలేదన్న ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన విజయకాంత్ పార్టీశ్రేణులకు పిలుపునిస్తూ ప్రకటన విడుదల చేశారు. జూన్ నాలుగో తేదీన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నదని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఈ దృష్ట్యా, ఆ సమావేశానికి పెద్ద ప్రాధాన్యత నెలకొన్నట్టే కనిపిస్తోంది.