భారతీయ జనతా పార్టీతో డీఎండీకే అధినేత విజయకాంత్ దోస్తీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొత్తు ఖరారుపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది .
డీఎండీకేతో పొత్తుకోసం అన్ని ప్రయత్నాలు చేసి భంగపడిన బీజేపీ మళ్లీ చర్చలు ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ప్రధాన కార్యదర్శి ఎస్ మోహన్‌రాజు రెండు రోజులుగా విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతతో మంతనాలు జరుపుతున్నారు. రెండు పార్టీల్లో నెలకొన్న పంతా లు పొత్తు చర్చల ప్రతిష్ఠంభనకు దారితీశాయి. అయితే విజయకాంత్ ఒక మెట్టుదిగివచ్చి తొలుత డిమాండ్ చేసిన 20 స్థానాలను వదిలి 14 స్థానాలను కోరుతున్నారు. అయితే 12 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ సుముఖం గా ఉంది. బీజేపీ కూటమిలో ఇప్పటికే ఎండీఎంకే, పీఎంకే, కొంగునాడు, ఇండియ జననాయక కట్చి తదితర పార్టీలు ఉన్నాయి. ఎండీఎంకే 10 స్థానాలు, పీఎంకే 12, తన మిత్రపక్షానికి 2 కోరుతున్నారుు. ఈ పార్టీలన్నింటీకి పంపాలు జరపాల్సి ఉందని బీజేపీ నేతలు కెప్టెన్‌కు నచ్చజెప్పారు. చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చిన దశలో పొత్తుపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడయ్యే అవకాశం ఉంది.
అన్బుమణి ఆగ్రహం : డీఎండీకేతో పొత్తు కోసం తమకు కేటాయించాల్సిన స్థానాల్లో కోత విధించడంపై పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ కుమారుడు అన్బుమణి రాందాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పొత్తు ఖరారై 20 రోజులు దాటుతున్నా కెప్టెన్ కోసం తమ అంశాన్ని పెండింగ్‌లో పెట్టారని ఆయన విమర్శిస్తున్నారు.
తమ పార్టీతో పొత్తు చర్చలు జరిపినప్పటి సామరస్య ధోరణి నేడు కరువైందని అన్నారు. తమ పార్టీకి 10, తమ మిత్రపక్షాలకు కనీసం రెండు స్థానాలకు తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో పార్టీకోసం జరుపుతున్న పాకులాటలో తమను బలిపశువును చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేతో పొత్తు ఖరారుచేసుకున్న సీపీఐ తమ పార్టీ నేతలకు కేటాయించాల్సిన స్థానాలపై శనివారం మూడో దశ చర్చలను పూర్తిచేసింది. అయితే ఇంకా స్థానాలపై స్పష్టత రాలేదు.